Telugu Global
Telangana

డ్రగ్స్ రహిత తెలంగాణ.. రేవంత్ కల సాధ్యమేనా..?

హైదరాబాద్‌ లో మత్తుమందుల ప్రభావం ఎక్కువగా ఉందని, ఇది గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తోందని అన్నారు సీఎం రేవంత్. దీని నియంత్రణకోసం ప్రస్తుతమున్న తెలంగాణ రాష్ట్ర నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(టీఎస్‌ న్యాబ్‌)ను పటిష్టపరచాలని సూచించారు.

డ్రగ్స్ రహిత తెలంగాణ.. రేవంత్ కల సాధ్యమేనా..?
X

హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ కావడం, తెలుగు సినీ ఇండస్ట్రీకి ఇదే హబ్ కావడం, జాతీయ రవాణాతోపాటు, అంతర్జాతీయ రవాణా సౌకర్యాలు కూడా అందుబాటులో ఉండటంతో.. డ్రగ్స్ వినియోగం కూడా ఇక్కడ ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. నగరంలో జరిగే నేరాలకు డ్రగ్స్ వినియోగంతో ప్రత్యక్ష సంబంధాలున్నట్టు చాలా సార్లు బయటపడింది. పోలీసులు ఎంత నిఘా పెట్టినా రేవ్ పార్టీలను మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. ఇకపై తెలంగాణలో మత్తుమందు అనే పేరే వినపడకూడదని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో మాదకద్రవ్యాల నియంత్రణకోసం తీసుకోవాల్సిన చర్యలపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

హైదరాబాద్‌ లో మత్తుమందుల ప్రభావం ఎక్కువగా ఉందని, ఇది గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తోందని అన్నారు సీఎం రేవంత్. దీని నియంత్రణకోసం ప్రస్తుతమున్న తెలంగాణ రాష్ట్ర నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(టీఎస్‌ న్యాబ్‌)ను పటిష్టపరచాలని సూచించారు. TS-NABలో ఖాళీల భర్తీకి కూడా సీఎం ఆమోదముద్ర వేశారు. మాదకద్రవ్యాల నేరగాళ్లు, అనుమానితులపై సాంకేతికంగా నిఘా పెట్టేందుకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మత్తుమందుల నియంత్రణకు అనుసరించాల్సిన విధానం, కావాల్సిన సదుపాయాలపై రెండ్రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ తరహాలో TS-NABను బలోపేతం చేసి, పూర్తిస్థాయి అధికారిని నియమిస్తామని చెప్పారు సీఎం రేవంత్.

హైదరాబాద్ లో పాశ్చాత్య సంస్కృతి పెరుగుతున్న నేపథ్యంలో డ్రగ్స్ కల్చర్ కూడా చాపకింద నీరులా మారుతోంది. విదేశాలనుంచి దిగుమతి చేసుకునే మాదక ద్రవ్యాలతోపాటు, స్థానికంగా లభించే గంజాయి వంటివాటి వినియోగం కూడా పెరుగుతోంది. ఆన్ లైన్ లో కూడా గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యాపారాన్ని నడుపుతున్నారు కొంతమంది. అరెస్ట్ లు సహజమే కానీ, దీన్ని పూర్తిగా అరికట్టడం మాత్రం సాధ్యం కావడంలేదు. TS-NAB బలోపేతం చేస్తే పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశముంది. గతంలో సినీ ఇండస్ట్రీలో కొంతమందిని ఎంక్వైరీ చేసి వదిలేశారు. ఇటీవల నటుడు నవదీప్ ని మరోసారి విచారణకు పిలిపించారు. మొత్తమ్మీద ఈ డ్రగ్స్ జాడ్యం ఆనవాళ్లు ఇంకా కనపడుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ పాలనలో మార్పు కనిపిస్తుందేమో చూడాలి.

First Published:  12 Dec 2023 4:25 AM GMT
Next Story