Telugu Global
Telangana

పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం- రేవంత్‌రెడ్డి

లోక్‌సభ ఎన్నిలకోసం కాంగ్రెస్ మేనిఫెస్టో సిద్ధమైందని, ఆ మేనిఫెస్టో విడుదలకు తెలంగాణ వేదిక కావడం సంతోషంగా ఉందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం- రేవంత్‌రెడ్డి
X

ఇటీవల బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోలిక చెబుతూ కేటీఆర్ ఆసక్తికర కామెంట్లు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ పదేళ్ల పాలన నిజం అని, కాంగ్రెస్ వందరోజుల పాలన అబద్ధం అని, ఇక కేంద్రంలో బీజేపీ పాలన పదేళ్ల విషం అని పేర్కొన్నారు. అప్పటికప్పుడు ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నుంచి ఎవరూ కౌంటర్ ఇవ్వలేదు కానీ, తాజాగా సీఎం రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. తెలంగాణలో బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగిందని కౌంటర్ ఇచ్చారు.


పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగిందని అన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. కోలుకోలేని విధంగా ఆ పార్టీ నేతలు తెలంగాణలోని ఆర్థిక, సహజ వనరులను దోచుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ పాలనతో రాష్ట్రంలో కరవు వచ్చిందంటూ ఇటీవల బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. వర్షాకాలం, చలికాలం ఎప్పుడొస్తుందో కూడా ఆ పార్టీ నేతలకు తెలియడం లేదని, పదేళ్ల తర్వాతయినా వారికి రైతులు, వ్యవసాయం గుర్తొచ్చినందుకు సంతోషం అని అన్నారు.

మేనిఫెస్టో

లోక్‌సభ ఎన్నిలకోసం కాంగ్రెస్ మేనిఫెస్టో సిద్ధమైందని, ఆ మేనిఫెస్టో విడుదలకు తెలంగాణ వేదిక కావడం సంతోషంగా ఉందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తుక్కుగూడ వేదిక నుంచే కాంగ్రెస్‌ పార్టీ జాతీయస్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తుందని చెప్పారాయన. ఏప్రిల్‌ 6న ‘జనజాతర’ పేరుతో మేనిఫెస్టో విడుదల సభకోసం జరుగుతున్న ఏర్పాట్లను రేవంత్ రెడ్డి పర్యవేక్షించారు. కేంద్రంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటవుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక నిధులు తీసుకొస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి.

First Published:  2 April 2024 12:08 PM GMT
Next Story