Telugu Global
Telangana

ఇది రైతు - మహిళ - యువత నామ సంవత్సరం - రేవంత్ రెడ్డి

ఆర్థిక, విద్యుత్ రంగాల్లో వాస్తవ పరిస్థితులను శ్వేతపత్రాల ద్వారా ప్రజల ముందు ఉంచామన్న రేవంత్ రెడ్డి.. త్వరలోనే సాగునీటి రంగంలో జరిగిన అవినీతిపై కూడా శ్వేతపత్రం రిలీజ్‌ చేస్తామన్నారు.

ఇది రైతు - మహిళ - యువత నామ సంవత్సరం - రేవంత్ రెడ్డి
X

నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు తెలంగాణ ప్రజలకు తన సందేశాన్ని పంపారు. ప్రజలందరి సహకారంతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నారు. నిర్భందాలు, ఇనుప కంచెలను తొలగించామన్నారు రేవంత్ రెడ్డి. పాలనలో ప్రజలను భాగస్వామ్యం చేశామన్నారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ, పౌరులకు స్వేచ్ఛ హామీని నిలబెట్టుకున్నామని తన సందేశంలో స్పష్టంచేశారు.

ఇక ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే రెండు గ్యారెంటీలు అమలు చేశామన్నారు రేవంత్ రెడ్డి. కొత్త ఏడాదిలో మిగతా గ్యారెంటీల అమలకు సిద్ధంగా ఉన్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందాలనేది తమ లక్ష్యమని చెప్పారు. రైతుల విషయంలో ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. ఈ నూతన సంవత్సరం రైతు - మహిళ - యువత నామ సంవత్సరంగా సంకల్పం తీసుకున్నామని చెప్పారు. ప్రజా పాలనకు అనుగుణంగా పునర్‌వ్యవస్థీకరణ జరుగుతోందన్నారు.

ఆర్థిక, విద్యుత్ రంగాల్లో వాస్తవ పరిస్థితులను శ్వేతపత్రాల ద్వారా ప్రజల ముందు ఉంచామన్న రేవంత్ రెడ్డి.. త్వరలోనే సాగునీటి రంగంలో జరిగిన అవినీతిపై కూడా శ్వేతపత్రం రిలీజ్‌ చేస్తామన్నారు. అధికారం కోల్పోయిన ఈర్ష్యతో కొందరు చేసే తప్పుడు ప్రచారాలు, అసత్య ప్రకటనలతో గందరగోళానికి గురి కావొద్దని సూచించారు. ఇది గత పాలన కాదు.. జన పాలన అని చెప్పారు.

తెలంగాణ ఉద్యమకారులపై నమోదైన కేసుల వివరాలు సేకరిస్తున్నామని.. ఆ కేసుల నుంచి విముక్తి కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. ఆటో కార్మికులు, అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం 5 లక్షల బీమా సౌకర్యాన్ని తీసుకొచ్చామన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ కోటి రతనాల వీణగా.. కోట్లాది ప్రజల సంక్షేమ వాణిగా.. అభివృద్ధిలో శిఖరాగ్రాన నిలవాలని ఆకాంక్షిస్తున్నానంటూ తన సందేశంలో కోరుకున్నారు.

First Published:  31 Dec 2023 8:24 PM GMT
Next Story