Telugu Global
Telangana

రేపు ఉదయం 10 గంటలకు రేవంత్ ప్రజా దర్బార్

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల ఫైల్ పై సీఎం రేవంత్ తొలి సంతకం చేశారు. దివ్యాంగురాలు రజనీకి ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేశారు.

రేపు ఉదయం 10 గంటలకు రేవంత్ ప్రజా దర్బార్
X

పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీకోసం కష్టపడ్డ కార్యకర్తల్ని గుండెల్లో పెట్టి చూసుకునే బాధ్యత తనది అని స్పష్టం చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రగతి భవన్ ఇనుప కంచెలు బద్దలు కొట్టామని.. రేపు ఉదయం అక్కడ ప్రజా దర్బార్ నిర్వహిస్తామని చెప్పారు. ప్రగతి భవన్ పేరుని జ్యోతిరావు పూలే ప్రజా భవన్ గా మార్చారు. తెలంగాణ ప్రజలకు ఈరోజు స్వేచ్ఛ లభించిందని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకే ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని చెప్పారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటుతో సమాన అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలతోనే కాదని, ప్రపంచంతోనే పోటీపడేలా చేస్తానన్నారు.


తెలంగాణ ఆషామాషీగా ఏర్పడిన రాష్ట్రం కాదని, పోరాటాలతో త్యాగాలే పునాదులుగా ఏర్పడిన రాష్ట్రం అని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ సమిధగా మారి తెలంగాణ ఏర్పాటు చేసిందన్నారు. తమ కష్టాలు వినేవారు లేక పదేళ్లుగా ప్రజలు మౌనంగా ఉన్నారని, ఈ ఎన్నికల్లో ప్రజా రాజ్యాం తెచ్చుకున్నారని చెప్పారు. తాము పాలకులం కాదని, ప్రజల సేవకులం అని అన్నారు. కార్యకర్తల కష్టాన్ని, శ్రమను గుర్తుపెట్టుకుంటానన్నారాయన. విద్యార్థి, నిరుద్యోగ, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేస్తానన్నారు రేవంత్ రెడ్డి. జై సోనియమ్మా అంటూ సీఎం రేవంత్ తన ప్రసంగాన్ని మొదలు పెట్టి జై జై కాంగ్రెస్ అంటూ ముగించారు.

తెలంగాణ సీఎంగా రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మంత్రులు కూడా ప్రమాణం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల ఫైల్ పై సీఎం రేవంత్ తొలి సంతకం చేశారు. దివ్యాంగురాలు రజనీకి ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేశారు.

First Published:  7 Dec 2023 10:12 AM GMT
Next Story