Telugu Global
Telangana

13వసారి ఢిల్లీకి.. రేవంత్ పై బీఆర్ఎస్ సెటైర్లు

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 4నెలల్లో 13వసారి ఢిల్లీకి వెళ్లిన సీఎంగా రేవంత్ రెడ్డి రికార్డ్ సృష్టించారని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు.

13వసారి ఢిల్లీకి.. రేవంత్ పై బీఆర్ఎస్ సెటైర్లు
X

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కంటే ఢిల్లీలోనే ఎక్కువగా ఉంటున్నారని బీఆర్ఎస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఢిల్లీకి గులాంగిరి చేయడమే కాంగ్రెస్ నేతల పని అని సెటైర్లు పేలుస్తున్నారు. ఇప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇది ఆయనకు 13వ పర్యటన అని గుర్తు చేసి మరీ టార్గెట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 4నెలల్లో 13వసారి ఢిల్లీకి వెళ్లిన సీఎంగా రేవంత్ రెడ్డి రికార్డ్ సృష్టించారని అంటున్నారు.

ఢిల్లీకి ఎందుకు..?

ఈరోజు ఢిల్లీలో జరుగుతున్న కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు నిన్న(గురువారం) రేవంత్‌ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. తెలంగాణలో బ్యాలెన్స్ ఉన్న మూడు లోక్ సభ స్థానాల అభ్యర్థులపై కూడా ఆయన అధిష్టానం క్లారిటీ తీసుకోవాల్సి ఉంది. ఇప్పటి వరకు 14 లోక్‌సభ స్థానాలకు మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం, కరీంనగర్‌, హైదరాబాద్‌ సీట్లు పెండింగ్ లో ఉన్నాయి. అభ్యర్థుల ఖరారు విషయంలో ఢిల్లీలో మంతనాలు జరుగుతున్నాయి.

ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్.. మూడు స్థానాలు కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. ఖమ్మం టికెట్‌ తమ కుటుంబ సభ్యులకే కావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు పోటీ పడుతున్నారు. వీరెవరికీ టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని తేలిపోయింది. ఓ దశలో రామసహాయం రఘురామరెడ్డి పేరు ఖరారైందని అన్నారు. తాజాగా నిజామాబాద్‌ జిల్లాకు చెందిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర రావు పేరు తెరపైకి వచ్చింది. కరీంనగర్ సీటు విషయంలో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి, రాజేశ్వరరావు పేర్లు బలంగా వినపడుతున్నాయి. ఇక హైదరాబాద్‌ స్థానంలో మజ్లిస్‌తో కుదిరిన అవగాహన మేరకు కాంగ్రెస్‌ డమ్మీ అభ్యర్థి కోసం వెదుకుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనతో ఈ మూడు స్థానాలపై ఓ క్లారిటీ వస్తుంది.

First Published:  12 April 2024 2:43 AM GMT
Next Story