Telugu Global
Telangana

మోదీని పెద్దన్న అని ఎందుకు అన్నానంటే..?

బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే దేశానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని, ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాలకు మరింత అన్యాయం జరుగుతుందన్నారు రేవంత్ రెడ్డి.

మోదీని పెద్దన్న అని ఎందుకు అన్నానంటే..?
X

ప్రధాని మోదీ పెద్దన్న అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. ప్రత్యర్థులకు బ్రహ్మాండమైన ఆయుధంగా మారాయి. ఇప్పటికీ బడేమియా-చోటేమియా అంటూ బీఆర్ఎస్ నుంచి కౌంటర్లు పడుతూనే ఉన్నాయి. దీంతో రేవంత్ రెడ్డి పదే పదే వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. తాజాగా మరోసారి ఆయన పెద్దన్న వ్యాఖ్యలపై స్పందించారు. "మనది ఫెడరల్‌ వ్యవస్థ. ప్రధానమంత్రి అన్ని రాష్ట్రాలకు బాధ్యత వహిస్తారు కాబట్టే ఇటీవల రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆయన్ను కలిశా. పెద్దన్న అని సంబోధించా. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. ప్రధానమంత్రిగా వచ్చారు, ముఖ్యమంత్రిగా స్వాగతం చెప్పా, రాష్ట్రానికి ఏమేం కావాలో కోరా." అని అన్నారు రేవంత్ రెడ్డి.

దేశంలో నరేంద్ర మోదీ ప్రభావం మసకబారిందని అన్నారు రేవంత్ రెడ్డి. మాటలు చెప్పి పని చేయకుంటే ఎంత కాలం ప్రజలు నమ్ముతారని ప్రశ్నించారు. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే దేశానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని, ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాలకు మరింత అన్యాయం జరుగుతుందన్నారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే మరిన్ని సంకుచిత విధానాలను అవలంబించే అవకాశం ఉందన్నారు రేవంత్ రెడ్డి.

ఆ రెండు పార్టీలు ఒకటే..

బీఆర్ఎస్ ను ఇప్పటికే తిరస్కరించిన ప్రజలు, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి కూడా ఇదే రకమైన తీర్పు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు రేవంత్ రెడ్డి. ఆ రెండు పార్టీలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని వివరించారు. ఎన్నికల ముందు అన్ని రకాల డ్రామాలకు తెరలేపుతున్నారని, లోపల మాత్రం పరస్పరం సహకరించుకుంటున్నారని విమర్శించారు.

100 రోజుల్లోనే తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పట్టాలెక్కించామని చెప్పారు రేవంత్ రెడ్డి. ఐదు గ్యారెంటీలు అమలు చేశామన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ప్రక్షాళణ చేశామని, ఉద్యోగాల భర్తీ ప్రారంభించామని వివరించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్య, వైద్యం, రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని, పంటల భీమా పథకాన్ని ప్రారంభించడంతోపాటు పెట్టుబడి సాయం మొదలు పెట్టామని చెప్పారు. ధరణి పోర్టల్‌ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామన్నారు రేవంత్ రెడ్డి. తమ పనితీరుకి లోక్ సభ ఎన్నికల్లో ఫలితం కనపడుతుందన్నారు. రాష్ట్రంలో 12 నుంచి 14 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలిచే అవకాశాలున్నాయని చెప్పారు రేవంత్ రెడ్డి.

First Published:  22 March 2024 3:09 AM GMT
Next Story