Telugu Global
Telangana

మా ఎంపీలు, ఎమ్మెల్సీలు వీళ్లే.. ఢిల్లీ పెద్దల ముందు రేవంత్ లిస్ట్

లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ పెద్దలు రాష్ట్రనేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. అలాగే టిక్కెట్ ఆశిస్తున్నవాళ్ల జాబితాను అధిష్టానం ముందు ఉంచబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

మా ఎంపీలు, ఎమ్మెల్సీలు వీళ్లే.. ఢిల్లీ పెద్దల ముందు రేవంత్ లిస్ట్
X

సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ (గురువారం) ఢిల్లీ వెళ్తున్నారు. రేవంత్‌రెడ్డితో పాటు మంత్రుల బృందం కూడా ఢిల్లీ వెళ్తోంది. లోక్‌సభ ఎన్నికలు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, గవర్నర్‌ కోటాలో ప్రతిపాదించే ఎమ్మెల్సీ అభ్యర్థులు, నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై అధిష్టానంతో చర్చించేందుకే అంతా ఢిల్లీకి వెళ్తున్నారు.

పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీతో రేవంత్ టీమ్ భేటీ కానుంది. లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ పెద్దలు రాష్ట్రనేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. అలాగే టిక్కెట్ ఆశిస్తున్నవాళ్ల జాబితాను అధిష్టానం ముందు ఉంచబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అభ్యర్థుల్ని పరిశీలించి అధిష్టానం తన నిర్ణయం ప్రకటిస్తుంది. ఈనెల 15న సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ఉంది. తిరిగి వచ్చాక లోక్‌సభ నియోజకవర్గాలకు సమన్వకర్తలతో సమీక్షలు నిర్వహిస్తారని సమాచారం.

సీఎం ఢిల్లీ పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ అభ్యర్థిత్వం కోసం కాంగ్రెస్‌ నేతలతోపాటు తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్‌ కోదండరామ్‌ వంటివారి పేర్లను కూడా పరిశీలనలో ఉన్నాయి. అద్దంకి దయాకర్‌ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేయాలని సీఎం కోరుతారని సమాచారం. రెండో ఎమ్మెల్సీ అభ్యర్థిగా మైనార్టీ నాయకులకు అవకాశం కల్పించాలని భావిస్తున్నారు. ఎమ్మెల్యే కోటాలో మైనార్టీలకు అవకాశం కల్పిస్తే ఫిరోజ్‌ఖాన్‌, షబ్బీర్‌ అలీ పేర్లను పరిశీలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సీఎం ఢిల్లీ పర్యటన తర్వాత దీనిపై పూర్తి స్పష్టత వస్తుంది.

First Published:  11 Jan 2024 5:01 AM GMT
Next Story