Telugu Global
Telangana

సీఎం కేసీఆర్ పథకాలు బాగున్నాయి.. మేం అధికారంలోకి వచ్చినా కొనసాగిస్తాం : బండి సంజయ్

తెలంగాణ రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు అన్నింటినీ కొనసాగిస్తామని బండి సంజయ్ చెప్పారు.

సీఎం కేసీఆర్ పథకాలు బాగున్నాయి.. మేం అధికారంలోకి వచ్చినా కొనసాగిస్తాం : బండి సంజయ్
X

బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై ఎప్పుడూ విరుచుకపడే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అకస్మాతుగా రూటు మార్చారు. తెలంగాణలో అధికారం చేపట్టిన నాటి నుంచి సీఎం కేసీఆర్ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని పదే పదే ఆరోపిస్తుంటారు. సంక్షేమ పథకాలు కూడా చాలా మందికి అందడం లేదని విమర్శిస్తుంటారు. అలాంటి బండి సంజయ్.. ఇప్పుడు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు బాగున్నాయని ప్రశంసించారు.

తెలంగాణ రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు అన్నింటినీ కొనసాగిస్తామని చెప్పారు. ధరణిలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. వాటన్నింటినీ సరి చేసి అందరికీ ఉపయోగపడేలా చేస్తామని అన్నారు. బీజేపీ మోర్చాల అధ్యక్షులతో జరిగిన సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ధరణిని రద్దు చేయబోమని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలు కూడా కొనసాగుతాయని హామీ ఇచ్చారు.

కాగా, మరో వైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం ధరణిని రద్దు చేసి బంగాళాఖాతంలో పడేస్తామని చెబుతోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధరణిపై అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఎక్కడ మీటింగ్ జరిగినా, విలేకరుల సమావేశం నిర్వహించినా.. ధరణి లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. అయితే, సీఎం కేసీఆర్ ఇటీవల పలు బహిరంగ సభల్లో ధరణి వల్ల కలుగుతున్న లాభాలను వివరించారు. 1 శాతం ఎక్కడైనా తప్పు జరిగి ఉండవచ్చు. వాటిని సరిచేసే ప్రయత్నం జరుగుతోంది. కానీ ధరణి వల్లే అనేక ప్రయోజనాలను తెలంగాణ రైతులు అందుకుంటున్నారని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

ధరణితో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఆసరా పెన్షన్లు, దళిత బంధు, రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు, గొర్రెల పంపిణీ, రూ.1 లక్ష సాయం, అమ్మ ఒడి వాహనాలు.. ఇలా అనేక పథకాలను అన్ని వర్గాల వారికి అందజేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా కేసీఆర్ పథకాలను నేరుగా విమర్శించలేదు. ప్రజల్లో ఆదరణ ఉన్న పథకాలపై విమర్శలు చేస్తే.. అది తమకే నష్టం చేస్తుందని గ్రహించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ కూడా కేవలం ధరణి లక్ష్యంగా విమర్శలు చేస్తోంది. ఇప్పుడు బీజేపీ అయితే కేసీఆర్ పథకాలు ఒక్కటి కూడా రద్దు చేయబోమని చెప్పడం గమనార్హం.

First Published:  16 Jun 2023 4:53 PM GMT
Next Story