Telugu Global
Telangana

కేసీఆర్ ప్రశ్నలతో మోదీలో చలనం.. బీజేపీ సీఎంలతో మీటింగ్..

ప్రత్యేకంగా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం అయిన మోదీ.. మిగతా రాష్ట్రాలకంటే మెరుగ్గా ఉండాలని వారికి సూచించడం విశేషం.

కేసీఆర్ ప్రశ్నలతో మోదీలో చలనం.. బీజేపీ సీఎంలతో మీటింగ్..
X

హైదరాబాద్ లో బీజేపీ కార్యవర్గ సమావేశాల సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీకి కొన్ని ప్రశ్నలు సంధించారు. తెలంగాణలో మీటింగ్ పెట్టుకునే ముందు వాటికి సమాధానం చెప్పాలని అన్నారు. తెలంగాణలో ఇంటింటికీ కుళాయి కనెక్షన్ ఉందని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ పద్ధతి ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణలో రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో ఈ పథకం అమలులో ఉందన్నారు, ఇతర పథకాల పేర్లు చెప్పి మరీ బీజేపీ పాలిత రాష్ట్రాల బండారాన్ని బయటపెట్టారు కేసీఆర్. అన్నిట్లోనూ తెలంగాణ ముందంజలో ఉందని చెప్పారు, కాదని మోదీ అనగలరా అని ప్రశ్నించారు. దానికి ప్రధాని వద్ద సమాధానం లేదు, కానీ ఇప్పుడు ఆ విషయంలో ఆయన హడావిడి పడుతున్నట్టు తెలిసింది. ప్రత్యేకంగా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం అయిన మోదీ.. మిగతా రాష్ట్రాలకంటే మెరుగ్గా ఉండాలని వారికి సూచించడం విశేషం.

ఆదర్శంగా ఉండాలి..

బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆయా రాష్ట్రాల్లో వారు చేపట్టిన అభివృద్ధి పనుల్ని సమీక్షించారు. కేంద్రం ప్రవేశపెట్టిన గతిశక్తి, ఇంటింటికీ తాగునీరు, స్వామిత్వ, ప్రభుత్వ ఈ-మార్కెట్‌ ప్లేస్‌ వంటి కార్యక్రమాలను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో విజయవంతంగా అమలు చేయాలని సూచించారు. కేంద్రం ప్రవేశపెట్టిన అన్ని పథకాలు ప్రజలకు సంతృప్తికర స్థాయిలో అందాలని చెప్పారు. ఈ విషయంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు మిగతావాటికంటే ముందుండాలన్నారు.

తలదించుకోకూడదు..

ఇటీవల నీతి ఆయోగ్ ర్యాంకుల్లో తెలంగాణ వంటి రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీలపై దాడుల గురించి మాట్లాడాల్సి వస్తే అందులో బీజేపీ పాలిత రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు సహజంగానే కేంద్రాన్ని ఇరుకున పెట్టేలా ఉంటాయి. తెలంగాణలో అమలవుతున్న పథకాలను.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలనే డిమాండ్లు మొదలయ్యాయి. రైతు బంధు లాంటి పథకాల విషయంలో దేశవ్యాప్తంగా రైతు సదస్సులు పెట్టి మరీ కేసీఆర్ కేంద్రాన్ని కార్నర్ చేయబోతున్నారు. ఈ దశలో ముందు బీజేపీ పాలిత రాష్ట్రాలపై ఫోకస్ పెంచాలనుకుంటున్నారు మోదీ. హైదరాబాద్ పర్యటనలో కేసీఆర్ చురుకు పుట్టించడంతో మోదీ నష్టనివారణ చర్యలు చేపట్టారు. దేశంలో తెలంగాణ పాలిత రాష్ట్రాలు ఆదర్శంగా నిలవాలని, మిగతా రాష్ట్రాలకంటే ముందు వరుసలో ఉండాలని బీజేపీ ముఖ్యమంత్రులకు హితబోధ చేశారు.

First Published:  25 July 2022 2:32 AM GMT
Next Story