Telugu Global
Telangana

ప్రభుత్వంపై వ్యతిరేకత తగ్గించడానికి సీఎం కేసీఆర్ సరికొత్త వ్యూహం

తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేకపోయినా.. రాష్ట్రంలోని 50 నుంచి 60 నియోజకవర్గాల ఎమ్మెల్యేలపై స్థానికంగా వ్యతిరేకత ఉన్నది.

ప్రభుత్వంపై వ్యతిరేకత తగ్గించడానికి సీఎం కేసీఆర్ సరికొత్త వ్యూహం
X

తెలంగాణ అసెంబ్లీకి మరో ఏడాదిలో ఎన్నికల జరుగనున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించడానికి సీఎం కేసీఆర్ సరి కొత్త వ్యూహానికి తెరలేపారు. ఇకపై జిల్లా కలెక్టర్లు సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు, సంక్షేమ పథకాలు, ధరణి పోర్టల్‌కు సంబంధించిన వివాదాలను ప్రయార్టీ బేస్‌లో పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతీ వారం వీటిని సంబంధించిన నివేదికను ప్రధాన కార్యదర్శికి పంపించాల్సి ఉంటుంది. ప్రజలకు నేరుగా సంబంధం ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఇలా చేయడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత తగ్గించే వీలుంటుందని కేసీఆర్ అంచనా వేస్తున్నారు.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన 2014 నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నది. వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో ఉండటంతో కొంచెం ప్రభుత్వ వ్యతిరేకత పెరిగింది. తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేకపోయినా.. రాష్ట్రంలోని 50 నుంచి 60 నియోజకవర్గాల ఎమ్మెల్యేలపై స్థానికంగా వ్యతిరేకత ఉన్నది. కేసీఆర్ చేయించిన సర్వేలతో పాటు.. ఐ-పాక్ టీమ్ రెండు సార్లు చేసిన సర్వేల్లో ఈ విషయం వెల్లడైంది. టీఆర్ఎస్ ప్రభుత్వ పని తీరు, అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో మంచి అభిప్రాయాన్ని కలుగజేశాయి. అయితే కొంత మంది ఎమ్మెల్యేలు స్థానికంగా అందుబాటులో లేకపోవడం, వారి వైఖరి కారణంగా ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని సర్వేల్లో తేలింది.

ఈ నెల 3న నిర్వహించిన టీఆర్ఎస్ఎల్పీ సమావేశం సందర్భంగా కేసీఆర్ ఈ విషయంలోనే ఎమ్మెల్యేలను హెచ్చరించారు. ఇకపై ఎవరూ హైదరాబాద్‌లో ఉండొద్దని.. ఎవరి నియోజకవర్గాలకు వాళ్లు వెళ్లాలని ఆదేశించారు. హైదరాబాద్‌లో ఏం పని ఉందని ఇక్కడే ఉంటున్నారని ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. వెంటనే ఎవరి నియోజకవర్గాలకు వాళ్లు వెళ్లి ప్రజలతో మమేకం కావాలని సూచించారు. అవసరం అయితే వారానికి ఓ సారి సామూహిక భోజనాల కార్యక్రమం నిర్వహించి ప్రజలతో మాట్లాడాలని చెప్పారు.

ఇక తాజాగా ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న సమస్యల పరిష్కారానికి కలెక్టర్లను అప్రమత్తం చేయాలని సీఎం సోమేశ్ కుమార్‌కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎస్ ఆదివారం లేఖలు రాశారు. ప్రతీ వారం పోడు భూముల వివాదాలు, ఆసరా పెన్షన్ల పంపిణీ వేగవంతం, జీవో 59 భూములకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న అప్లికేషన్ల పరిష్కారం, ధరణి పోర్టల్‌లో తలెత్తిన సమస్యలకు సంబంధించిన విషయాలు, మిస్సింగ్ సర్వే నెంబర్ల క్రమబద్దీకరణ, రెవెన్యూ శాఖకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్లకు ఆ లేఖలో పేర్కొన్నారు.

ఇటీవల ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్‌లో ఫుడ్ పాయిజనింగ్ కేసులు పెరుగుతున్నాయి. వీటితో పాటు విద్యార్థులు అనారోగ్య సమస్యలు ఎదుర్కుంటున్నారు. ఈ సమస్యలపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్లకు సూచించారు. ఇకపై విద్యార్థులకు సంబంధించి ఎలాంటి కంప్ల‌యింట్లు రాకూడదని ఆదేశించారు. పైన పేర్కొన్న అంశాలకు సంబంధించిన వీక్లీ రిపోర్టును సీఎస్‌కు పంపాలని కూడా చెప్పారు. కలెక్టర్లు పంపిన రిపోర్టు ఆధారంగా ప్రతీ వారం సీఎం కేసీఆర్‌కు సీఎస్ బ్రీఫింగ్ చేయనున్నారు. ప్రజలు ఎలాంటి సమస్యతో వచ్చినా పరిష్కరించేలా చొరవ తీసుకోవాలని సీఎం చెప్పారు.

రాష్ట్రంలో ప్రజలు ఎక్కువగా భూ సంబంధిత సమస్యలతో సతమతం అవుతున్నారు. అంతే కాకుండా చాలా మందికి పెన్షన్లు అందడం లేదు. స్కూల్, హాస్టల్స్ సమస్యలు కూడా ప్రయార్టీగా తీసుకున్నారు. ఇవన్నీ పరిష్కరించడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేకత తగ్గించవచ్చని కేసీఆర్ అంచనా వేశారు. అందుకే ప్రతీ వారం దీనికి సంబంధించిన రిపోర్టును పంపాలని ఆదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

First Published:  19 Sep 2022 3:25 AM GMT
Next Story