Telugu Global
Telangana

మనదే గెలుపు.. కామారెడ్డిలో పోటీ వెనుక కారణం ఇదే - కేసీఆర్‌

తూంకుంటలోని ఓ కన్వెన్షన్‌ హాల్‌లో జరిగిన సమావేశానికి మంత్రి హరీష్‌ రావు, ఒంటేరు ప్రతాప్‌ రెడ్డి సహా గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్య‌లో హాజరయ్యారు

మనదే గెలుపు.. కామారెడ్డిలో పోటీ వెనుక కారణం ఇదే - కేసీఆర్‌
X

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజ‌యం ఖాయమన్నారు ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్. 95 నుంచి 100 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గజ్వేల్‌ నియోజకవర్గ కార్యకర్తలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తూంకుంటలోని ఓ కన్వెన్షన్‌ హాల్‌లో జరిగిన సమావేశానికి మంత్రి హరీష్‌ రావు, ఒంటేరు ప్రతాప్‌ రెడ్డి సహా గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్య‌లో హాజరయ్యారు.

రాష్ట్రానికే తలమానికంగా గజ్వేల్‌ను తీర్చిదిద్దుతామని ప్రకటించారు కేసీఆర్. కామారెడ్డిలో పోటీ వెనుక ప్రత్యేక కారణాలు ఉన్నాయని చెప్పారు. ఇకపై ప్రతి నెల ఒకరోజు గజ్వేల్‌ నియోజకవర్గంలో ఉండి పనులు చేయిస్తానన్నారు. గజ్వేల్‌ నియోజకవర్గంలో నిరుపేద ఉండకూడదన్నదే తన లక్ష్యమన్నారు. ఇప్పటివరకూ గజ్వేల్‌లో చేసిన అభివృద్ధితో తాను సంతృప్తి పడట్లేదని.. చేయాల్సింది చాలా ఉందన్నారు. తనను ఎంత మెజార్టీతో గెలిపిస్తారనేది గజ్వేల్‌ ప్రజల దయ అన్నారు.

ఇప్పటికే గజ్వేల్‌లో ఈటల పోటీ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే గజ్వేల్‌లో ఈటల సామాజిక వర్గం ముదిరాజ్‌ ఓట్లే కీలకం. దాదాపు 50 వేలకుపైగా ముదిరాజ్ ఓట్లు ఉన్నట్లు సమాచారం. కొంతమంది నేతలు ఇప్పటికే ఈటలతో టచ్‌లో ఉన్నారని సీఎంవో కార్యాలయం గుర్తించింది. ఇటీవల కొంతమంది గజ్వేల్‌ నియోజకవర్గ నేతలు సైతం తమ అసంతృప్తిని బయటపెట్టారు. సీఎం కేసీఆర్‌ను కలుసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది.

First Published:  20 Oct 2023 12:39 PM GMT
Next Story