Telugu Global
Telangana

మొక్కజొన్న కొనుగోలుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్.. చర్యలు తీసుకోవాలని ఆదేశం

మక్కలు ఇప్పడు కొనుగోలు చేయడం వల్ల ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం వాటిల్లుతుంది. అయినా సరే రైతులకు ఇబ్బంది కలుగకుండా చూసేందుకే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.

మొక్కజొన్న కొనుగోలుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్.. చర్యలు తీసుకోవాలని ఆదేశం
X

తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో సాగైన మక్కలు (మొక్క జొన్నలు) కొనుగోలు చేసేందుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోయినా.. రైతులకు అండగా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకున్నది. కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి నిరంజన్ రెడ్డి ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశనం చేశారు. అవసరమైన చోట్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని చెప్పారు. ఈ మేరకు మార్క్‌ఫెడ్ అధికారులు చర్యలు చేపట్టారు.

యాసంగి సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 6.50 లక్షల ఎకరాల్లో మక్క పంట సాగైంది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో రైతులు మొక్కజొన్నను ఎక్కువగా సాగు చేశారు. ఈ సారి దాదాపు 17.37 లక్షల టన్నుల మక్క దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా రైతులు పంటను నష్టపోయారు. మరో వైపు మార్కెట్‌లో ధర పడిపోవడంతో చేతికొచ్చేది ఎంతో అర్థం కాక ఆందోళన చెందుతున్నారు.

రైతుల పరిస్థితిని తెలుసుకొని తెలంగాణ ప్రభుత్వం మక్క రైతులకు అండగా నిలిచింది. కేంద్రం వెనకడుగు వేసినా.. మొత్తం పంటను ప్రభుత్వమే సొంతగా కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రంలో మక్క పంటకు గత నెల వరకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. క్వింటాల్ మొక్కజొన్నకు మద్దతు ధర రూ.1,962 ఉండగా.. మార్కెట్‌లో మాత్రం రూ.2,600 పలికింది. అయితే అకస్మాతుగా ధర పడిపోయింది. ఒకవైపు వర్షాలు, మరోవైపు భారీగా పడిపోయిన ధరతో రైతులు పంటను అమ్ముకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకొని వెళ్లడంతో ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ఒప్పుకున్నారు. వాస్తవానికి మక్కలు ఇప్పడు కొనుగోలు చేయడం వల్ల ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం వాటిల్లుతుంది. అయినా సరే రైతులకు ఇబ్బంది కలుగకుండా చూసేందుకే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.

First Published:  27 April 2023 2:02 PM GMT
Next Story