Telugu Global
Telangana

రేపు రెండో విడత గొర్రెల పంపిణీ.. మంచిర్యాలలో ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

శుక్రవారం నుంచి ప్రారంభించే 2వ విడత లో 3 లక్షల 37 వేల 816 మంది లబ్దిదారులకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేయనున్నారు. ఇందుకు గాను 6085 కోట్ల రూపాయలను ఖర్చు అవుతుంది.

రేపు రెండో విడత గొర్రెల పంపిణీ.. మంచిర్యాలలో ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
X

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గొల్ల, కురుమలకు సబ్సిడీపై గొర్రెల పంపిణీ 2వ విడత కార్యక్రమం శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్నది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మంచిర్యాల జిల్లాలో ప్రారంభించనుండగా, రాష్ట్ర పశుసంవర్థ‌క, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నల్లగొండ జిల్లా నకిరేకల్ లో ప్రారంభిస్తారు. అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, నియోజకవర్గాలలో కూడా 2వ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆయా జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు లబ్దిదారులకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేస్తారు.

కులవృత్తులను ప్రోత్సహించాలి.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి ఆలోచనల నుంచి రూపొందినదే గొర్రెల యూనిట్ల పంపిణీ కార్యక్రమం. ఈ పథకాన్ని స్వయంగా ముఖ్యమంత్రే రూపకల్పన చేశారు. గొర్రెల పెంపకం వృత్తిగా జీవనం సాగిస్తున్న గొల్ల, కురుమలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనే ఆలోచనతో సుమారు 11 వేల కోట్ల రూపాయల వ్యయంతో గొర్రెల యూనిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ముందుగా రాష్ట్రంలో ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ చేపట్టి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన గొల్ల, కురుమలను గుర్తించి గొర్రెల పెంపకం దారుల సొసైటీ లలో సభ్యత్వం కల్పించింది. వీరికి 20 గొర్రెలు, ఒక పొటేలు కలిపి ఒక యూనిట్ గా, ఒక్కో యూనిట్ ధరను ఒక లక్ష 25 వేల రూపాయలుగా నిర్ణయించడం జరిగింది.

ఇందులో ప్రభుత్వం 75 శాతం (93,750 రూపాయలు), లబ్దిదారుడి వాటాధనం 25 శాతం (31,25౦ రూపాయలు) చెల్లించాలి. మొదటి విడతలో 5 కోట్ల రూపాయల వ్యయంతో 3 లక్షల 93 వేల 552 మంది లబ్దిదారులకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేశారు. ఇందులో ప్రభుత్వ వాటా నిధులు 3 వేల 751 కోట్ల రూపాయలు కాగా, లబ్దిదారుల వాటాదనం 1,250 కోట్ల రూపాయలు. గొర్రెల ధరలు పెరిగిన కారణంగా 2వ విడతలో యూనిట్ ధరను ఒక లక్ష 25 వేల రూపాయల నుంచి 50 వేలకు పెంచి ఒక ఒక లక్ష 75 వేల రూపాయలు చేశారు. ఇందులో ఒక్కో యూనిట్ కు ప్రభుత్వ వాటాధనం ఒక లక్ష 31 వేల 250 రూపాయలు కాగా, లబ్దిదారుడి వాటా 43,75౦ రూపాయలుగా ఉన్నది.

శుక్రవారం నుంచి ప్రారంభించే 2వ విడత లో 3 లక్షల 37 వేల 816 మంది లబ్దిదారులకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేయనున్నారు. ఇందుకు గాను 6085 కోట్ల రూపాయలను ఖర్చు అవుతుంది. ఇందులో ప్రభుత్వ వాటాధనం 4,563.75 కోట్ల రూపాయలు కాగా, లబ్దిదారుల వాటాధానం 1521.25 కోట్ల రూపాయలు. లబ్దిదారులకు గొర్రెల యూనిట్ తో పాటు గొర్రెల కు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తారు. గొర్రె చనిపోతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ గా మరో గొర్రెను కొనుగోలు చేసి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా అవసరమైన మందులు, కొనుగోలు ప్రాంతం నుండి లబ్దిదారుడి ఇంటి వరకు గొర్రెలను తీసుకొచ్చేందుకు అయ్యే రవాణా ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుంది.

First Published:  8 Jun 2023 4:37 PM GMT
Next Story