Telugu Global
Telangana

నేడు ఒకే సారి 9 మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లో తరగతులను సీఎం కేసీఆర్ వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు.

నేడు ఒకే సారి 9 మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
X

తెలంగాణను వైద్య రంగంలో నంబర్ 1గా నిలబెట్టాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ అనేక చర్యలు తీసుకుంటున్నారు. కేవలం ఆసుపత్రుల నిర్మాణం, కేసీఆర్ కిట్, కంటి వెలుగు, అమ్మ ఒడి వంటి పథకాల ప్రవేశ పెట్టడమే కాకుండా.. వైద్య విద్యలో కూడా ముందుండాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలని నిర్ణయించారు. గతంలో ఒకే రోజు 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించిన సీఎం కేసీఆర్.. శుక్రవారం మరో 9 మెడికల్ కాలేజీల్లో తరగతులను ప్రారంభించనున్నారు.

రాష్ట్రంలోని కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లో తరగతులను సీఎం కేసీఆర్ వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. మెడికల్ కాలేజీల ప్రారంభం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించారు. మెడికల్ కాలేజీల ఏర్పాటుతో జిల్లాకు కలిగే ప్రయోజనాలను వివరించాలని తెలిపారు.

మెడికల్ కాలేజీల ప్రారంభం సందర్భంగా ఆయా జిల్లా కేంద్రాల్లో 15 వేల నుంచి 20 వేల మందితో జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించనున్నారు. యువత, విద్యార్థులను ఇందులో భాగస్వామ్యులు చేయాలని ఇప్పటికే మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఆదేశించారు. మెడికల్ కాలేజీల ఏర్పాటుతో కేవలం విద్యార్థులకే కాకుండా.. దానికి అనుబంధంగా వచ్చే హాస్పిటల్ వల్ల ప్రజలకు అత్యుత్తమ సేవలు అందుతాయని ప్రజలకు వివరించనున్నారు. ఇక ఈ రోజు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కామారెడ్డి మెడికల్ కాలేజీలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు.


First Published:  14 Sep 2023 11:52 PM GMT
Next Story