Telugu Global
Telangana

నేడు ఢిల్లీ వెళ్లనున్న సీఎం కేసీఆర్.. రేపు బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం

సీఎం కేసీఆర్ బుధవారం ఢిల్లీ చేరుకొని రెండు రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. కొంత మంది జాతీయ నాయకులతో కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉన్నది.

నేడు ఢిల్లీ వెళ్లనున్న సీఎం కేసీఆర్.. రేపు బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం
X

బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఈ రోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. దేశ రాజధానిలో కొత్తగా నిర్మించిన పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఆయన గురువారం మధ్యాహ్నం 1.05 గంటలకు ప్రారంభించనున్నారు. ఢిల్లీలోని వసంత్ విహార్‌లో బీఆర్ఎస్ కోసం శాశ్వత కార్యాలయం నిర్మాణానికి డిసెంబర్‌లో శంకుస్థాపన చేశారు. పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించాలంటే, ముఖ్యంగా నార్త్ ఇండియాలో బీఆర్ఎస్ పార్టీని ప్రజలకు దగ్గర చేయడానికి తప్పకుండా ఒక కార్యాలయం అవసరం. జాతీయ రాజకీయాల్లో ఉన్న పార్టీలన్నింటికీ ఢిల్లీలో కార్యాలయాలు ఉన్నాయి. ఆ అవసరాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ ఇప్పటికే సర్దార్ పటేల్ రోడ్డులో తాత్కాలిక కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇక రేపు శాశ్వత కార్యాలయం ప్రారంభం కానుండటంతో ఇకపై పార్టీ కార్యకలాపాలన్నీ అక్కడి నుంచే నిర్వహించనున్నారు.

సీఎం కేసీఆర్ బుధవారం ఢిల్లీ చేరుకొని రెండు రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. కొంత మంది జాతీయ నాయకులతో కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉన్నది. బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన సీఎం కేసీఆర్.. ప్రతీ నెల ఢిల్లీ వెళ్తున్నారు. ఇప్పటి వరకు ఢిల్లీలోని నివాసం, తాత్కాలిక కార్యాలయంలో సమావేశాలు నిర్వహించిన కేసీఆర్.. ఇకపై కేంద్ర కార్యాలయంలోనే అన్ని రకాల సమావేశాలు నిర్వహించనున్నారు.

కేంద్ర కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలు శాఖలకు ప్రత్యేకంగా గదులు కేటాయించారు. పార్టీ విస్తరణలో చురుకుగా ఉన్న బీఆర్ఎస్ కిసాన్ సెల్ కోసం సమావేశ మందిరాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తున్నది. కాగా, పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి ఇతర పార్టీల నాయకులను ఎవరినీ పిలవడం లేదని సమాచారం.ఇది పూర్తిగా పార్టీ వ్యవహారం కావడంతోనే సీఎం కేసీఆర్ ఆ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఢిల్లీ పార్టీ కార్యాలయం నిర్మాణ పనులన్నీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. ఢిల్లీలో బీఆర్ఎస్‌కు ఒక శాశ్వత భవనం ఉండటం పార్టీ కార్యకర్తలను, తెలంగాణ ప్రజలకు గర్వకారణమని ఆయన అన్నారు. ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్.. బీఆర్ఎస్‌గా మారి ఇప్పుడు జాతీయ స్థాయిలో ఎదగాలని ప్రయత్నిస్తున్న సమయంలో.. ఢిల్లీ పార్టీ ఆఫీసు తప్పకుండా ప్రధాన వేదికగా ఉంటుందని మంత్రి చెప్పారు. ఈ పార్టీ కార్యాలయం ఓపెన్ చేసిన తర్వాత ఉత్తరాదిన పార్టీ కార్యకలాపాల్లో మరింత వేగం పెరుగుతుందని మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్పారు.

శాశ్వత కార్యాలయం ప్రారంభోత్సవ ఏర్పాట్లను ఎంపీ జోగినపల్లి సంతోశ్ కుమార్ దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది.

First Published:  3 May 2023 2:15 AM GMT
Next Story