Telugu Global
Telangana

నేడు కొత్త సచివాలయంలో తొలి సమీక్ష నిర్వహించనున్న సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం కొత్త సెక్రటేరియట్‌లో తొలి సమీక్ష నిర్వహించనున్నారు.

నేడు కొత్త సచివాలయంలో తొలి సమీక్ష నిర్వహించనున్న సీఎం కేసీఆర్
X

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ఆదివారం ప్రారంభించారు. సచివాలయాన్ని అత్యంత ఆధునిక సౌకర్యాలతో 7,79,982 చదరపు అడుగుల విస్తీర్ణంలో సువిశాలంగా నిర్మించారు. నిన్ననే సీఎం కేసీఆర్, మంత్రులు, ఉన్నతాధికారులు తమకు కేటాయించిన ఛాంబర్లలో ఆసీనులయ్యారు. కేసీఆర్ తన ఛాంబర్‌లో అడుగుపెట్టిన తర్వాత ఆరు ఫైళ్లపై సంతకాలు చేశారు. అనంతరం సచివాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులను ఉద్దేశించి ప్రసంగించారు.

ఇక సీఎం కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం కొత్త సెక్రటేరియట్‌లో తొలి సమీక్ష నిర్వహించనున్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు, కరివేన, ఉదండాపూర్ కాల్వల విస్తరణ పనులు, వికారాబాద్, కొడంగల్ వెళ్లే కాల్వ పనులకు సంబంధించి సమీక్ష చేస్తారు. అలాగే రాష్ట్రంలో ప్రారంభించిన కొత్త ప్రాజెక్టులు, వాటి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుంటారు.

మరోవైపు రాష్ట్రంలో అకాల వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాల కారణంగా వాటిల్లిన పంట నష్టం వివరాలపై అధికారులతో సమీక్షిస్తారు. ప్రభుత్వం తరపున తీసుకోవాల్సిన చర్యలను సీఎం కేసీఆర్ వివరిస్తారు. ఏయే ప్రాంతాల్లో ఎంత మేర పంటలకు నష్టం వాటిల్లింది. రైతులను ఆదుకోవడానికి ఏం చేయాలనే విష‌యాల‌పై స‌మీక్ష‌లో చ‌ర్చిస్తారు. యాసంగి ధాన్యం, మక్కల కొనుగోలుకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి సీఎం కేసీఆర్ తెలుసుకోనున్నారు. ఈ స‌మావేశానికి సంబంధిత శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు.

First Published:  1 May 2023 5:55 AM GMT
Next Story