Telugu Global
Telangana

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి.. జాతికి అంకితం చేసిన సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ తన చేతులతో ఆన్ చేసిన మోటార్ల నుంచి బయటకు వచ్చిన కృష్ణమ్మ జలాలు అంజనగిరి రిజార్వాయర్ లోకి చేరుకోగానే అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి.. జాతికి అంకితం చేసిన సీఎం కేసీఆర్
X

తెలంగాణ చరిత్రలో మరో సువర్ణధ్యాయం మొదలైంది. రాష్ట్ర ఇంజనీరింగ్ అద్భుతాల్లో కాళేశ్వరం తర్వాత మరో భారీ ప్రాజెక్టు ప్రారంభమైంది. 70 ఏళ్ల పాలమూరు బిడ్డల కల చివరకు నెరవేరింది. దక్షిణ తెలంగాణ వరప్రదాయినిగా చెప్పుకుంటున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి చూపిస్తానని చెప్పిన సీఎం కేసీఆర్.. చివరకు అనుకున్నది సాకారం చేశారు. 2015లో తన చేతుల మీదుగానే శంకుస్థాపన చేసిన పీఆర్ఎల్ఐ ప్రాజెక్టును శనివారం ప్రారంభించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ వద్ద 145 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మోటార్లను ఆన్ చేసి వెట్ రన్‌ను దిగ్విజయంగా పూర్తి చేశారు.

సీఎం కేసీఆర్ తన చేతులతో ఆన్ చేసిన మోటార్ల నుంచి బయటకు వచ్చిన కృష్ణమ్మ జలాలు అంజనగిరి రిజార్వాయర్ లోకి చేరుకోగానే అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పైలాన్‌ను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. పాలమూరు ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.

శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుంచి రోజుకు 2 టీఎంసీల నీరు ఎత్తిపోసేలా ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశారు. గోదావరి నది నీటిని ఉత్తర తెలంగాణ కోసం వాడుకునేలా రూపొందించిన కాళేశ్వరం రికార్డును బ్రేక్ చేసేలా.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కోసం భారీ మోటార్లు ఉపయోగించారు. 145 మెగావాట్ల కెపాసిటీ కలిగిన 9 అల్ట్రా మెగా మోటార్లను ఏర్పాటు చేశారు. అంతే కాకుండా ఈ ప్రాజెక్టు కోసం 915 కిలోమీటర్ల పొడవున ప్రాథమిక కాల్వలను నిర్మించారు.

ఈ బాహుబలి మోటార్లు రోజుకు 3,200 క్యూసెక్కుల మేర నీటిని పారించగలవు. ఈ మోటార్ల ద్వారా రెండు టీఎంసీల నీటిని నార్లాపూర్‌ జలాశయానికి తరలించి నిల్వ చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పాలమూరు ప్రాజెక్టు కోసం దాదాపు రూ.35 వేల కోట్లను ఖర్చు చేసింది. ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తయితే ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, వికారాబాద్‌, నల్గొండ జిల్లాల్లోని 12.30 లక్షల ఎకరాలకు సాగు నీరుతో పాటు 1,200 గ్రామాలకు తాగు నీరు అందనున్నది. అంతే కాకుండా హైదరాబాద్ శివారులోని పరిశ్రమల అవసరాలకు నీళ్లు కూడా ఈ ప్రాజెక్టు నుంచి తరలించనున్నారు.


First Published:  16 Sep 2023 12:02 PM GMT
Next Story