Telugu Global
Telangana

గంప గోవర్ధన్ ఇంటికి కేసీఆర్.. స్థానిక నేతలకు కీలక సూచనలు

నామినేషన్ కంటే ముందే ఎమ్మెల్యే గంప గోవర్దన్ ఇంట్లో కీలక సమీక్ష జరిపారు సీఎం కేసీఆర్. ఈ సమావేశంలో గంప గోవర్ధన్‌, ఎమ్మెల్సీ సుభాష్‌రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు.

గంప గోవర్ధన్ ఇంటికి కేసీఆర్.. స్థానిక నేతలకు కీలక సూచనలు
X

గజ్వేల్ లో నామినేషన్ కార్యక్రమం ముగించుకుని కామారెడ్డి వెళ్లిన సీఎం కేసీఆర్.. అక్కడ నామినేషన్ కంటే ముందు స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్దన్ నివాసానికి వెళ్లారు. కామారెడ్డిలో తాజా రాజకీయాలపై పార్టీ నేతలతో చర్చించారు. పార్టీ ప్రచార కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో ఆరా తీశారు. ఇటీవల పార్టీ నేతల మధ్య ప్రచారం విషయంలో జరిగిన వివాదాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఎన్నికల సమయంలో పార్టీ నుంచి తప్పుడు సంకేతాలు వెళ్లే విధంగా ఎవరూ ప్రవర్తించొద్దని సూచించారు కేసీఆర్. పార్టీ గీత దాడితే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.

అసలేం జరిగింది..?

కామారెడ్డిలో కేసీఆర్ తరపున ప్రచారం చేసేందుకు.. గ్రామాలకు ఇన్ చార్జ్ లను ప్రకటించారు. ఒకరి గ్రామంలో మరొకరు ప్రచారం చేశారన్న కారణంగా ఇద్దరు నేతల మధ్య గొడవ జరిగింది. భౌతిక దాడులు జరగడంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇదే విషయంపై మంత్రి కేటీఆర్ కూడా ఇటీవల కామారెడ్డిలో ఆకస్మిక పర్యటన చేపట్టారు. ఆ ఇద్దరు నేతలతో మాట్లాడారు, ఇకపై వివాదాలజోలికి వెళ్లొద్దని సూచించారు. కామారెడ్డిలో సీఎం కేసీఆర్ బరిలో ఉండటం, ఇక్కడ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా పోటీకి దిగడంతో బీఆర్ఎస్ ఈ సీటుని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రేవంత్ రెడ్డికి డిపాజిట్లు గల్లంతు కావాలని స్థానిక నేతలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్ అధిష్టానం. ఆ స్థాయిలో ప్రచారం ముమ్మరం చేయాలని ఆదేశాలిచ్చింది. అయితే క్షేత్ర స్థాయిలో జరిగిన పరిణామాలపై సీఎం కేసీఆర్ కూడా ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది. అందుకే ఆయన నామినేషన్ కంటే ముందే ఎమ్మెల్యే గంప గోవర్దన్ ఇంట్లో కీలక సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో గంప గోవర్ధన్‌, ఎమ్మెల్సీ సుభాష్‌రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు.

గంప గోవర్దన్ కీలకం..

సీఎం కేసీఆర్ కోసం కామారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్దన్ ఈసారి తన సీటు త్యాగం చేశారు. కేసీఆర్ కోరుకుంటే ఎవరైనా కాదనరు కానీ, గోవర్దన్ మాత్రం తానే ముందుండి కేసీఆర్ విజయానికి కామారెడ్డిలో ప్రచారం చేస్తున్నారు. ఈ దశలో గోవర్దన్ ఇంటికి వెళ్లి మరీ ఆయనను కలిశారు సీఎం కేసీఆర్. నామినేషన్ వేయడానికి ముందే గోవర్దన్ ఇంటికి కేసీఆర్ వెళ్లడం విశేషం.

First Published:  9 Nov 2023 9:36 AM GMT
Next Story