Telugu Global
Telangana

కేంద్రంలో పక్షపాతం లేని ప్రభుత్వం ఉండాలి –కేసీఆర్

దేశ అభివృద్ధిలోనే మన అభివృద్ధి ఇమిడి ఉంటుందని చెప్పారు. భవిష్యత్తు రాజకీయాల్లో దేశానికే సరికొత్త వెలుగు చూపించే అద్భుతమైన చైతన్య వీచిక తెలంగాణ నుంచే వీయాలని ఆకాంక్షించారు.

కేంద్రంలో పక్షపాతం లేని ప్రభుత్వం ఉండాలి –కేసీఆర్
X

కేంద్రంలో పక్షపాత వైఖరి లేని ప్రభుత్వం ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. గతంలో తాను ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా ప్రజలు అద్భుతంగా స్పందించి సహకరించారని, ఇప్పుడు కూడా దేశ అభివృద్ధి కోసం చేసే పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. దేశ అభివృద్ధిలోనే మన అభివృద్ధి ఇమిడి ఉంటుందని చెప్పారు. భవిష్యత్తు రాజకీయాల్లో దేశానికే సరికొత్త వెలుగు చూపించే అద్భుతమైన చైతన్య వీచిక తెలంగాణ నుంచే వీయాలని ఆకాంక్షించారు. మహబూబాబాద్ జిల్లాలో సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని, బీఆర్ఎస్ ఆఫీస్ ని ప్రారంభించిన కేసీఆర్ బహిరంగ సభలో మాట్లాడారు.


తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నోసార్లు మహబూబాబాద్‌ వచ్చానని.. అప్పట్లో ఈ ప్రాంతంలో కరవు తాండవించేదని గుర్తు చేసుకున్నారు కేసీఆర్. కన్నీరు పెట్టుకుని ఏడ్చానని, పక్కన కృష్ణమ్మ ఉన్నా ఫలితం ఉండేది కాదన్నారు. తుంగతుర్తి, వర్ధన్నపేట, పాలకుర్తి ప్రాంతాలు తిరిగినప్పుడు అక్కడ సగం గీకిన కాలువలు చూసి ఈ జన్మలో నీళ్లు రావని బాధపడ్డానని గుర్తు చేశారు కేసీఆర్. తెలంగాణ వస్తే బంగారు మీసాలు చేయిస్తానని కొమురవెల్లి మల్లన్నకు మొక్కుకున్నానని.. స్వామి దయ, ప్రజలు చేసిన ఉద్యమం, మానుకోట రాళ్ల బలం అన్నీ కలిసి ఇప్పుడు అద్భుత రాష్ట్రం సాకారమైందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో పనులు చేసుకున్నామని చెప్పారు. కొత్త జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లు నిర్మించుకున్నామని తెలిపారు కేసీఆర్. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి నిధులిచ్చామని, ప్రతి పంచాయతీకి రూ.10లక్షలు మంజూరు చేశామని చెప్పారు.

మహబూబాబాద్ జిల్లాకు వరాలు..

జిల్లాకు కొత్తగా ఇంజినీరింగ్ కాలేజ్‌ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి తెస్తామన్నారు. తెలంగాణ రాకముందు రాష్ట్రంలో 3, 4 మెడికల్ కాలేజీలు ఉండేవని, రాష్ట్రం ఏర్పాటయ్యాక జిల్లాకో వైద్య కళాశాల తెచ్చుకున్నామని చెప్పారు. మహబూబాబాద్ పట్టణానికి రూ.50 కోట్లు, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ కు రూ.25 కోట్లు చొప్పున సీఎం ప్రత్యేక నిధి నుండి మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు.

First Published:  12 Jan 2023 10:11 AM GMT
Next Story