Telugu Global
Telangana

దళిత బంధు లబ్ధిదారులతో ఏప్రిల్ 14న భేటీ కానున్న సీఎం కేసీఆర్?

ఏప్రిల్ 14న దళితబంధ విజయోత్సవ సభ నిర్వహిస్తే బాగుంటుందని కేసీఆర్ ఆలోచిస్తున్నారు.

దళిత బంధు లబ్ధిదారులతో ఏప్రిల్ 14న భేటీ కానున్న సీఎం కేసీఆర్?
X

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 14న ఆవిష్కరిస్తోంది. అంబేద్కర్ జయంతి రోజు కావడంతో ఆ రోజు విగ్రహాన్ని ఆవిష్కరించాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. సీఎం కేసీఆర్ సహా ఇతర మిత్ర పక్షాల ముఖ్యమంత్రులు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కాగా, అదే రోజు దళితబంధు లబ్ధిదారులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే దళితబంధు పథకం ద్వారా వేలాది మంది దళితులకు యూనిట్లు వచ్చాయి. అయితే ఈ పథకం అమలు తీరుతెన్నులు, యూనిట్లు పెట్టుకున్న లబ్ధిదారుల మనోగతం, వారి అనుభవాలను తెలుసుకోవాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు.

ఏప్రిల్ 14న దళితబంధ విజయోత్సవ సభ నిర్వహిస్తే బాగుంటుందని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. దళిత బంధు లబ్ధిదారులను ఒక్కో జిల్లా నుంచి కనీసం 30 మందిని తీసుకొని హైదరాబాద్ రావాలని.. ఎస్సీ కార్పొరేషన్ అధికారులకు మౌఖికంగా ఆదేశాలు అందినట్లు తెలుస్తున్నది. ఈ సక్సెస్ మీట్‌లో దళితబంధు ద్వారా డబ్బులు తీసుకొని విజయవంతంగా యూనిట్లు నడిపిస్తున్న వారి అనుభవాలు, ఎలా వ్యాపారాన్ని ముందుకు తీసుకొని వెళ్లారో చెప్పే విజయగాథలను కేసీఆర్ వినాలని భావిస్తున్నారు. ఇప్పటికే అధికారులు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తున్నది.

ఇక తొలి విడతలో దళితబంధు ఇచ్చిన సమయంలో ఏవైనా లోటు పాట్లు ఉన్నాయా? పొరపాట్లు జరిగాయా? లాభాలు రాని యూనిట్లు ఏవైనా ఉన్నాయా? అనే వివరాలను సీఎం కేసీఆర్ ఈ భేటీలో చర్చిస్తారని చెబుతున్నారు. అంతే కాకుండా తర్వాత విడతలో ఎలాంటి యూనిట్లు ఉండాలి? మార్గదర్శకాల్లో ఏమైనా మార్పులు చేయాలా అనే విషయాలు కూడా అడుగుతారని తెలుస్తున్నది. దళితబంధు పథకం తర్వాత విడతలపైన అక్కడే సీఎం కేసీఆర్ ఒక స్పష్టమైన ప్రకటన చేస్తారని కూడా సమాచారం.

అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాతే ఈ సక్సెస్ మీట్ నిర్వహించనున్నారు. ఎల్బీస్టేడియం లేదా పరేడ్ గ్రౌండ్స్‌లో సభను ఏర్పాటు చేసేందుకు అవకాశాలు పరిశీలిస్తున్నారు. ఈ దళితబంధు సక్సెస్ మీట్‌కు అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్‌తో పాటు మరి కొందరు దళిత నేతలను కూడా ఆహ్వానించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. కాగా, ఏప్రిల్ 14న ఈ కార్యక్రమం ఎలా నిర్వహించబోతున్నారనే విషయాలను శనివారం ప్రకటిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

First Published:  31 March 2023 3:16 AM GMT
Next Story