Telugu Global
Telangana

నేడు కోనాయిపల్లికి కేసీఆర్.. ఆయన సెంటిమెంట్ ఏంటంటే..?

గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు సీఎం కేసీఆర్. ఈరోజు నామినేషన్ పత్రాలను తీసుకొచ్చి వేంకటేశ్వర స్వామివద్ద వాటిని ఉంచి పూజలు చేస్తారు. అనంతరం వాటిపై సంతకాలు చేస్తారు.

నేడు కోనాయిపల్లికి కేసీఆర్.. ఆయన సెంటిమెంట్ ఏంటంటే..?
X

తెలంగాణలో ఎన్నికలంటే.. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లిలోని వేంకటేశ్వర స్వామి ఆలయం వార్తల్లోకెక్కుతుంది. సీఎం కేసీఆర్ కచ్చితంగా ఈ ఆలయానికి వచ్చి పూజలు చేస్తారు. ఈ సారి కూడా ఎన్నికల సందర్భంగా ఆయన కోనాయిపల్లి వస్తున్నారు. అయితే అనుకున్న షెడ్యూల్ కాస్త ముందుకు వచ్చింది. ఈనెల 9న నామినేషన్లు వేసే రోజు ఆయన కోనాయిపల్లికి వస్తారని అనుకున్నా.. ఐదు రోజుల ముందుగానే ఆయన ఈ ఆలయానికి వస్తుండటం విశేషం.

సెంటిమెంట్ గుడి..

1985 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే సమయంలో కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు సీఎం కేసీఆర్. ఆ ఎన్నికల్లో ఆయన విజయకేతనం ఎగురవేశారు. అప్పటినుంచి ఈ ఆలయం ఆయనకు సెంటిమెంట్‌గా మారింది. 1989, 1994, 1999, 2004, 2009, 2014, 2018.. ఇలా ప్రతి ఎన్నికలో ఆయన ఈ ఆలయంలో పూజలు చేశాకే నామినేషన్‌ వేస్తూ వచ్చారు. పార్టీ ప్రకటన, ఉద్యమంలో ఏ కీలక నిర్ణయం అయినా ఇక్కడ పూజలు చేశాకే ప్రకటించేవారు కేసీఆర్. మంత్రి హరీష్ రావు కూడా ఈ సెంటిమెంట్ కొనసాగిస్తున్నారు. ఆయన కూడా ఈ ఆలయంలో పూజలు చేశాకే నామినేషన్ వేస్తారు.

కేసీఆర్, హరీష్ ఇద్దరూ..

ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు సీఎం కేసీఆర్. ఈరోజు నామినేషన్ పత్రాలను తీసుకొచ్చి వేంకటేశ్వర స్వామివద్ద వాటిని ఉంచి పూజలు చేస్తారు. అనంతరం వాటిపై సంతకాలు చేస్తారు. ఈనెల 9న గజ్వేల్, కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్ దాఖలు చేస్తారు. హరీష్ రావు కూడా కేసీఆర్ వెంట ఇదేరోజు తన నామినేషన్ పత్రాలతో ఆలయానికి వస్తారు.ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో చేపట్టిన రాజశ్యామల యాగం నిన్నటితో ముగియడంతో.. ఈరోజు కేసీఆర్ కోనాయిపల్లి ఆలయానికి వస్తున్నారు.

First Published:  4 Nov 2023 2:44 AM GMT
Next Story