Telugu Global
Telangana

సీఎం కేసీఆర్ టీచర్స్ డే గిఫ్ట్.. గురుకుల కాంట్రాక్టు పోస్టులు రెగ్యులర్

సాంఘీక సంక్షేమ గురుకులాల్లో పని చేస్తున్న 567 మంది కాంట్రాక్టు ఉపాధ్యాకులను రెగ్యులరైజ్ చేసింది. ఈ మేరకు సోమవారం జీవో విడుదల చేసింది.

సీఎం కేసీఆర్ టీచర్స్ డే గిఫ్ట్.. గురుకుల కాంట్రాక్టు పోస్టులు రెగ్యులర్
X

ఉపాధ్యాయ దినోత్సవ వేళ సీఎం కేసీఆర్ మరిచిపోలేని బహుమతి అందించారు. ఎస్సీ గురుకులాల్లో పని చేసే కాంట్రాక్టు ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేసింది. ఇప్పటికే బీసీ గురుకులాల్లో ఉన్న 139 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించిన తెలంగాణ ప్రభుత్వం.. తాజాగా సాంఘీక సంక్షేమ గురుకులాల్లో పని చేస్తున్న 567 మందిని కూడా రెగ్యులరైజ్ చేసింది. ఈ మేరకు సోమవారం జీవో విడుదల చేసింది.

ఉమ్మడి ఏపీలో సాంఘీక సంక్షేమ గురుకులాల్లోకి 567 మంది ఉపాధ్యాయులను కాంట్రాక్టు పద్దతిని తీసుకున్నారు. అందులో ఉపాధ్యాయులే కాకుండా స్టాఫ్ నర్సులు, లైబ్రేరియన్లు కూడా ఉన్నారు. 2007 నుంచి వీళ్లు కాంట్రాక్టు పద్దతిలోనే పని చేస్తూ వచ్చారు. ఉమ్మడి ఏపీలో రెగ్యులర్ ఉపాధ్యాయులకు సమానంగా కాంట్రాక్టు వారితో పని చేయించారు. కానీ ప్రభుత్వం వేతనాలు మాత్రం సమానంగా ఇవ్వలేదు. తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ గురుకులాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉపాధ్యాయులకు రెగ్యులర్ ఉపాధ్యాయులతో పాటు పీఆర్సీని అమలు చేశారు. అంతే కాకుండా కాంట్రాక్టు ఎంప్లాయిస్‌కు 12 నెలల పూర్తి జీతం చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు.

తాజాగా సాంఘీక సంక్షేమ గురుకులాల్లోని కాంట్రాక్టు ఉపాధ్యాయులను రెగ్యులర్ చేయాలని నిర్ణయం తీసుకోవడంతో 567 మందికి లబ్ధి చేకూరనున్నది. ఇందులో 504 మంది మహిళలే ఉండటం గమనార్హం. సాంఘీక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉపాధ్యాయులకు 12 నెలల జీతం, బేసిక్ పేతో పాటు ఆరు నెలల ప్రసూతి సెలవులకు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల కాంట్రాక్టు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాము జీవితాంతం సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని చెప్పారు. తమను రెగ్యులరైజ్ చేయడంతో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను సోమవారం సచివాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

ఉపాధ్యాయులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు..

ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల్లో క్రమ శిక్షణ, జ్ఞానం పెంపొందించి.. లక్ష్యం పట్ల వారికి స్పష్టమైన అవగాహన కల్సించి, వారిని కార్యసాధకులుగా తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర వెలకట్టలేనిదని సీఎం కేసీఆర్ అన్నారు. మాతృదేవోభవ.. పితృదేవోభవ.. ఆచార్యదేవోభవ.. అనే సూక్తిలో.. తల్లిదండ్రుల తర్వాత గురువులే ముఖ్యమని తెలియజేస్తున్నదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యతో పాటు ఉపాధ్యాయుల, విద్యార్థుల సంక్షేమానికి, అభివృద్ధికి సమర్థవంతమైన కార్యచరణ అమలు చేస్తోందని చెప్పారు.

తెలంగాణ గురుకుల విద్య దేశానికే ఆదర్శంగా నిలిచిందని, నాణ్యమైన విద్యను అందిస్తూ రేపటి తరాన్ని తీర్చిదిద్దడంలో ముందంజలో ఉన్నదని చెప్పారు. గుణాత్మక విద్యను అందిస్తూ చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వ కార్యచరణ సత్ఫలితాలను ఇస్తున్నదని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

First Published:  5 Sep 2023 12:39 AM GMT
Next Story