Telugu Global
Telangana

కొత్త సచివాలయం పరిశీలించిన కేసీఆర్ ఏం చెప్పారంటే..?

అంతర్గత రహదారులను విశాలంగా నిర్మించాలని, అడుగడుగునా ఆహ్లాదం వెల్లి విరియాలన్నారు కేసీఆర్. ప్రారంభోత్సవ ఏర్పాట్లపై కూడా ఆయన అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

కొత్త సచివాలయం పరిశీలించిన కేసీఆర్ ఏం చెప్పారంటే..?
X

తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణ పనుల్ని సీఎం కేసీఆర్ స్వయంగా పర్యవేక్షించారు. 2019లో సచివాలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినప్పటి నుంచి సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తరచూ పనుల్ని సమీక్షిస్తున్నారు. తాజాగా సచివాలయ ప్రారంభోత్సవానికి మహూర్తం ప్రకటించిన తర్వాత ఆయన మరోసారి ప్రాంగణానికి వచ్చి నిర్మాణ పనుల పురోగతిపై సమీక్షించారు. అనుకున్న టైమ్ కి పనులన్నీ పూర్తి చేయాలని, అదే సమయంలో నాణ్యతలో ఎక్కడా రాజీ పడకూడదని సూచించారు.

ఆధునిక ఫర్నిచర్, ఆకట్టుకునే రంగులు..

ప్రస్తుతం సచివాలయ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నారు. కళాకృతుల ఏర్పాటు, రంగులద్దడం, కొన్నిచోట్ల ఫినిషింగ్ వర్క్ మిగిలి ఉంది. సచివాలయానికి సృజనాత్మకంగా తుది మెరుగులు దిద్దాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఇంటీరియర్‌, గోడలకు ఏర్పాటు చేస్తున్న కళాకృతుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సచివాలయంలో సందర్శకులకు ఇబ్బందులు లేకుండా నిర్మాణాలు ఉండాలని, ఆధునిక ఫర్నిచర్‌ ఉపయోగించాలని, ఒకటికి రెండుసార్లు సరిచూసుకుని పనుల్ని పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు. పనులు సాగుతున్న తీరుపై కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు.


ప్రధాన భవనంపై ఏర్పాటుచేసిన డోములు, జాతీయ చిహ్నానికి మంచి రంగులు వాడాలని సూచించారు కేసీఆర్. ఆరో అంతస్తులోని తన కార్యాలయాన్ని కూడా ఆయన పరిశీలించారు. అదే ప్రాంగణంలో నిర్మిస్తున్న బ్యాంకులు, క్యాంటీన్‌, మీడియా సెంటర్‌, సందర్శకుల వెయిటింగ్ రూమ్ లను కూడా సీఎం పరిశీలించారు. ఆలయం, మసీదు, చర్చి నిర్మాణ పనుల గురించి కూడా ఆయన ఆరా తీశారు. సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఫౌంటెన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అంతర్గత రహదారులను విశాలంగా నిర్మించాలని, అడుగడుగునా ఆహ్లాదం వెల్లి విరియాలన్నారు కేసీఆర్. రక్షణ, అగ్నిమాపక వ్యవస్థ, ఏసీ ప్లాంటు, జనరేటర్‌ వ్యవస్థ ఏర్పాటుపై కూడా అధికారుల్ని పలు ప్రశ్నలు అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లపై కూడా ఆయన అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఫిబ్రవరి 17న ఉదయం 11.30 నుంచి 12.30 మధ్య సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బీహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వియాదవ్‌, జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్‌ సింగ్‌, బీఆర్ అంబేద్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేద్కర్‌ ఇతర రాజకీయ ప్రముఖులు హాజరవుతారు.

First Published:  25 Jan 2023 12:38 AM GMT
Next Story