Telugu Global
Telangana

ఏడాదిలోపు కృష్ణా పరవళ్లు తొక్కాలి..

వికారాబాద్ భూములకు ప్రత్యేకత ఉందని, కృష్ణా నీళ్లు వస్తే వాణిజ్య పంటలు పండుతాయని, రైతులు అద్భుతంగా ఎదుగుతారని అన్నారు కేసీఆర్.

ఏడాదిలోపు కృష్ణా పరవళ్లు తొక్కాలి..
X

వికారాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి ఏడాది లోపు పాల‌మూరు ఎత్తిపోత‌ల ద్వారా కృష్ణా న‌ది నీళ్లు తీసుకొచ్చే బాధ్య‌త తనది అని చెప్పారు సీఎం కేసీఆర్. ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో పాల్గొన్న ఆయన.. బీఆర్ఎస్ అభ్యర్థి మెతుకు ఆనంద్‌ ని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.


కాంగ్రెస్ నాయకులు అడ్డుతగిలినా కూడా పాల‌మూరు - రంగారెడ్డి ఎత్తిపోత‌లను పూర్తి చేసుకున్నామని, వికారాబాద్ కు కాల్వ తవ్వాల్సిన పని మాత్రమే మిగిలి ఉందని గుర్తు చేశారు కేసీఆర్. ప‌రిగి, వికారాబాద్, తాండూరు, చేవెళ్ల నియోజ‌క‌వ‌ర్గాల‌కు కృష్ణా న‌ది నీళ్లు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఆ నియోజ‌క‌వ‌ర్గాల‌కు కూడా పాల‌మూరు ఎత్తిపోత‌ల‌లో వాటా ఉందన్నారు. వికారాబాద్ భూములకు ప్రత్యేకత ఉందని, కృష్ణా నీళ్లు వస్తే వాణిజ్య పంటలు పండుతాయని, రైతులు అద్భుతంగా ఎదుగుతారని అన్నారు కేసీఆర్.

వికారాబాద్ జిల్లా ఏర్పాటు చేశాక ఇక్కడికే అన్ని కార్యాలయాలు ఏర్పాటయ్యాయని, డిగ్రీ, మెడిక‌ల్ కాలేజీలను కూడా ఆనంద్ పట్టుబట్టి సాధించుకొచ్చాడని చెప్పారు కేసీఆర్. మెడికల్ కాలేజీతోపాటు, న‌ర్సింగ్, పారామెడిక‌ల్ కాలేజీలు కూడా వస్తాయన్నారు. 450పడకల ఆస్పత్రి ఏర్పాటు చేసుకుంటున్నామని, చిన్న చిన్న జ‌బ్బుల‌కు హైద‌రాబాద్ పోవాల్సిన అస‌వ‌ర‌మే ఉండ‌దన్నారు.

రాబోయే రోజుల్లో వికారాబాద్‌ లో ఐటీ కార్య‌క‌లాపాలు విస్త‌రిస్తాయని, చాలా మంది రావ‌డానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు కేసీఆర్. ఇక్కడ కాలుష్యం లేని ప‌రిశ్ర‌మ‌లు రాబోతున్నాయన్నారు. అనంత ప‌ద్మ‌నాభ ఆల‌యాన్ని అభివృద్ధి చేసుకుంటామని, అనంత‌గిరిని ప‌ర్యాట‌క ప్రాంతంగా అభివృద్ధి చేసుకుందామన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని, పొరపాటు చేస్తే.. పదేళ్లు తాము పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీరవుతుందని అన్నారు.

దళితబంధుతో దళితవాడలు దొరలవాడలుగా మారాయని చెప్పారు కేసీఆర్. ఆనంద్ ను మరోసారి గెలిపిస్తే.. ఈసారి వికారాబాద్ నియోజకవర్గం అంతటికీ ఒకేసారి దళితబంధు అమలు చేస్తామన్నారు. దళితుల్ని కాంగ్రెస్, బీజేపీలు ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయని మండిపడ్డారు. దళితబంధు గతంలోనే తెచ్చి ఉంటే.. ఈ పాటికే ఆ జాతి అభివృద్ధి చెంది ఉండేదన్నారు కేసీఆర్.

First Published:  23 Nov 2023 11:17 AM GMT
Next Story