Telugu Global
Telangana

మేం తెలంగాణ బిడ్డలం.. అంగట్లో సరుకులం కాదు

తెలంగాణ బిడ్డలు అంగట్లో అమ్ముడు పోయే సరుకులు కాదని దేశానికి చాటి చెప్పారన్నారు. వంద కోట్ల రూపాయలు ఇస్తామన్నా గడ్డిపోచతో సమానంగా విసిరికొట్టి... తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడిన బిడ్డలంటూ ఎమ్మెల్యేలను పొగిడారు.

మేం తెలంగాణ బిడ్డలం.. అంగట్లో సరుకులం కాదు
X

- బీజేపీవి అన్నీ విడదీసే రాజకీయాలే

- మోడీ విశ్వ గురువా.. విషగురువా?

- నలుగురు ఎమ్మెల్యేలు తెలివిగా వ్యవహరించారు

- కోర్టులో ఉంది కాబట్టి ఎక్కువగా మాట్లాడను

- మునుగోడుకు బీజేపీ చేసింది ఏమీ లేదు

- ప్రభాకర్ రెడ్డిని గెలిపించండి.. మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటడు

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోడీపై తెలంగాణ సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై ఆయన తన మనసులోని మాటలను తెలంగాణ ప్రజానికానికి చండూరు వేదికగా వెల్లడించారు. విశ్వగురువుగా పిలిపించుకుంటున్న మోడీ.. అసలు విశ్వగురువా లేదా విషగురువా అని ఎద్దేవా చేశారు. దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరుస్తూ.. వందల కోట్ల రూపాయలు కుమ్మరించి కొనుగోళ్లకు పాల్పడుతున్న బీజేపీ ప్రభుత్వ చర్యలను ఆయన ఎండగట్టారు. మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఆదివారం చండూరు మండలం బంగారిగడ్డలో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు.

తెలంగాణగో గత 20 రోజులుగా జరుగుతున్న పరిణామాలన్నీ అందరికీ తెలుసు.. న్యాయం, ధర్మం ఏమిటో ప్రజలకు అర్థం అయ్యింది. ప్రధాని మోడీ ఎందుకీ కిరాతకం.. ప్రధాని పదవిని మించినది లేదుకదా.. మరెందుకు ఇలాంటి అరాచకం సృష్టిస్తున్నారు అని కేసీఆర్ మండిపడ్డారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవర్థన్ రెడ్డి, రేగా కాంతారావు లాంటి నాయకులు రాజకీయాల్లో ఉండాలి. వాళ్లు చాలా తెలివిగా వ్యవహరించి.. జాతి గౌరవాన్నే కాకుండా దేశ గౌరవాన్ని కాపాడారు. తెలంగాణ బిడ్డలు అంగట్లో అమ్ముడు పోయే సరుకులు కాదని దేశానికి చాటి చెప్పారన్నారు. వంద కోట్ల రూపాయలు ఇస్తామన్నా గడ్డిపోచతో సమానంగా విసిరికొట్టి... తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడిన బిడ్డలంటూ ఎమ్మెల్యేలను పొగిడారు. ఈ విషయంలో ఎక్కువగా మాట్లాడదలచుకోలేదని.. ప్రస్తుతం కోర్టులో ఉన్నది కాబట్టి అంతా తర్వాత తేలుతుందని చెప్పారు.

మోడీ అండదండలు లేకుండానే ఆర్ఎస్ఎస్‌కు చెందిన వ్యక్తులు హైదరాబాద్‌కు వచ్చి ఎమ్మెల్యేల బేరసారాలు సాగిస్తారా అని కేసీఆర్ ప్రశ్నించారు. అలా వచ్చిన వ్యక్తుల ఇవ్వాళ చంచల్‌గూడ జైలులో ఉన్నారని కేసీఆర్ అన్నారు. దీని వెనుక ఉన్న వ్యక్తులు ఒక్క క్షణం కూడా పదవిలో ఉండటానికి అర్హత లేదని కేసీఆర్ ఉద్ఘాటించారు. స్వతంత్ర భారత దేశంలో ఇలాంటి అరాచకం జరుగుతూ ఉంటే మనం మౌనంగా ఉందామా అని కేసీఆర్ ప్రశ్నించారు.

నాకు బలం, బలగం తెలంగాణ ప్రజలే అని కేసీఆర్ అన్నారు. మీరే సహకరించకపోతే ఇంతటి అభివృద్ధిని సాధించేవాళ్లం కాదని చెప్పారు. ఇవ్వాళ మీటర్లు పెట్టే బీజేపీకి అవకాశం ఇస్తే.. నన్ను పక్కకు జరుపుతారు. కేసీఆర్‌ను పడగొట్టి తెలంగాణను కబ్జా చేద్దామని బీజేపీ చూస్తోంది. అలాంటి అవకాశం ఇవ్వొద్దని సీఎం విజ్ఞప్తి చేశారు. మనం మౌనంగా ఉంటే అదే మనకు శాపం అవుతుంది. ప్రేక్షకుల్లా చూడొద్దు.. ప్రతీ విద్యావంతుడు, ఓటరు, ప్రజలు ఈ సారి కారు గుర్తుకు ఓటేసి తెలంగాణను రక్షించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

చండూరు రెవెన్యూ డివిజన్ అనేది మన చేతిలోనే పనే.. రేపు మీరు ప్రభాకర్ రెడ్డిని గెలిపించిన వెంటనే అది సాకారం అవుతుంది. గతంలో ప్రభాకర్ రెడ్డిని ఓడించి ఓ గొడ్డలిని తెచ్చి పెట్టుకున్నారు. ఆయన ఇక్కడ చేసిందేమీ లేదు. ఆయన చేరిన బీజేపీ కూడా ఇక్కడ ఒక్క పని కూడా చేయలేదు. ఒకనాడు ఫ్లోరోసిస్ బాధితులను ఢిల్లీకి తీసుకెళ్లి షో చేశారు. కానీ మునుగోడు, నల్లగొండకు మంచినీటిని ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని కేసీఆర్ అన్నారు. ప్రభాకర్ రెడ్డి ఓడి పోయినా.. మీ ఇంటి ఫంక్షన్లకు, శుభకార్యాలకు, చావులకు వచ్చాడు. ప్రతీ ఒక్కరికి అందుబాటులో ఉన్నాడు. అలాంటి వ్యక్తిని గెలిపించండి. ఆయన మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటాడు అని కేసీఆర్ చెప్పారు.

మునుగోడు ఉపఎన్నిక ఫలితం వచ్చిన తర్వాత అన్ని అభివృద్ధి పనులు మొదలవుతాయి. మీ కోరికలు, డిమాండ్లు అన్నీ నెరవేరుతాయి. రోడ్లు అద్దాల్లా మెరిసిపోతాయని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇవ్వాళ అందరూ వచ్చి గాయి గాయి గత్తర చేయవచ్చు. నవంబర్ 3 తర్వాత ఒక్కరు కూడా ఇక్కడకు రారు. కానీ నేను మునుగోడును చూసుకుంటాను. అందరూ కారు గుర్తుకు ఓటేసి తెలంగాణను గెలిపించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.

First Published:  30 Oct 2022 12:04 PM GMT
Next Story