Telugu Global
Telangana

వికారం అనిపించి వికారాబాద్ వాళ్లు ఆయన్ను వెళ్లగొట్టారు

వికారం అనిపించి వికారాబాద్ వాళ్లు ఆయన్ను వెళ్లగొట్టారు
X

జహీరాబాద్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మాణిక్ రావు మరోసారి బీఆర్ఎస్ టికెట్ పై బరిలో నిలిచారు. ఆయనపై కాంగ్రెస్ పార్టీ ఆగం చంద్రశేఖర్ ని పోటీకి దింపింది. ఆగంని ఏరికోరి వికారాబాద్ నుంచి మరీ తీసుకొచ్చారు. ప్రస్తుతం అక్కడ లోకల్, నాన్ లోకల్ ఫైట్ జరుగుతోంది. సీఎం కేసీఆర్ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన.. లోకల్ అయిన మాణిక్ రావుని మరోసారి ఆశీర్వదించాలన్నారు. నాన్ లోకల్ మనకు అవసరమా అని ప్రశ్నించారు.


వికారాబాద్‌ లో చెల్లని రూపాయి జహీరాబాద్‌ లో చెల్లుతుందా? అని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. వాళ్లకే వికారం అనిపించి వాళ్లే అక్కడి నుంచి వెళ్లగొట్టారు. రెండుసార్లు ఓడగొట్టారు. మళ్లీ జహీరాబాద్‌ లో ఆయన చెల్లుతాడా అన్నారు. లోకల్‌ లీడర్‌ మాణిక్‌ రావు కావాలా..? వికారాబాద్‌ ఆయన కావాలా? జహీరాబాద్‌ ప్రజల ఆత్మగౌరవ పరీక్ష ఇది అని అన్నారు కేసీఆర్. లోకల్‌ మనిషిని వదిలి పరాయి వాడిని గెలిపిస్తే మనకు ఏమన్నా ఇజ్జత్‌ ఉంటుందా? అన్నారు కేసీఆర్. మాణిక్ రావుని గెలిపిస్తే ఈ నియోజకవర్గంలో అన్ని పనులు తాను, మంత్రి హరీష్ దగ్గరుండి చేయిస్తామని హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్.

పొరపాటున కాంగ్రెస్ వాళ్లని గెలిపిస్తే ఇక్కడ కూడా కర్నాటక గతేనని హెచ్చరించారు సీఎం కేసీఆర్. వాళ్లు మన వేలితో మన కన్నే పొడుస్తారని అన్నారు. జాగ్రత్తగా ఆలోలించి ఓటు వేయండని ప్రజలకు పిలుపునిచ్చారు. తాను బహిరంగ సభలో చెప్పిన మాటల్ని గ్రామాల్లో చర్చకు పెట్టాలన్నారు కేసీఆర్. దీనిపై చర్చ జరిగితే ప్రజలు క్యూ కట్టి మరీ మనకే ఓట్లు వేస్తారన్నారు. సంగమేశ్వర లిఫ్ట్‌ పనులు మొదలయ్యాయని, పంప్‌ హౌస్‌ పనులు జరుగుతున్నాయని చెప్పారు కేసీఆర్. సింగూరుకు కాళేశ్వరం లింక్‌ అవుతోందని, ఇక 365 రోజులు సింగూరు నిండా నీళ్లే ఉంటాయన్నారు. జహీరాబాద్‌ కు లక్ష ఎకరాలకు సరిపడా నీళ్లు తెచ్చే బాధ్యత తనదేనన్నారు సీఎం కేసీఆర్.

First Published:  23 Nov 2023 1:56 PM GMT
Next Story