Telugu Global
Telangana

చెన్నమనేనిని ఎందుకు మార్చానంటే..?

ఇందిరమ్మ రాజ్యంలో సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాలను కల్లోలిత ప్రాంతాలుగా గుర్తించి, యువకులను కాల్చి చంపారని గుర్తు చేశారు కేసీఆర్. అప్పుడు భయంకరమైన పరిస్థితులు ఉండేవని, కాంగ్రెస్ వాళ్లు మళ్లీ ఇందిరమ్మ రాజ్యం అంటున్నారని, ఎవరి కొంప ముంచడానికి అని మండిపడ్డారు.

చెన్నమనేనిని ఎందుకు మార్చానంటే..?
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థులను మార్చిన అతి కొద్ది నియోజకవర్గాల్లో వేములవాడ కూడా ఒకటి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ ని కాదని, చెల్మెడ లక్ష్మీనరసింహారావుకి టికెట్ ఇచ్చారు సీఎం కేసీఆర్. ఈ నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ విజయం ప్రతిష్టాత్మకంగా మారింది. వేములవాడలో అసంతృప్తులంతా చివరకు బీఆర్ఎస్ గూటికి చేరడంతో విజయం సునాయాసం అని తేలిపోయింది. ఈ రోజు సీఎం కేసీఆర్ ఇక్కడ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. చెల్మెడను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నిజాయితీపరుడైన చెన్నమనేని రమేష్ ని ఎందుకు మార్చాల్సి వచ్చిందో ఆయన వివరించారు. కోర్టు కేసులతో పరేషాన్ ఎందుకని, ఆయన్ను అంతకంటే ఉన్నత పదవిలో పెట్టుకుంటామని, అందుకే అభ్యర్థిని మార్చాల్సి వచ్చిందని చెప్పారు కేసీఆర్.


వేములవాడతో నా అనుబధం..

వేములవాడ పట్టణానికి తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు సీఎం కేసీఆర్. ఇక్కడి రాజరాజేశ్వర స్వామి సన్నిధిలోనే తన వివాహం జరిగిందని చెప్పారు. ఈ గడ్డకు తాను శిరసు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. వేములవాడ ఆలయ అభివృద్ధిని కేసీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాజన్న మన ఇంటి ఇలవేల్పు అని, అందుకే ఆలయాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటున్నామని చెప్పారు. యాత్రికుల కోసం కాటేజీలు నిర్మించబోతున్నట్టు ప్రకటించారు. కలికోట సూరమ్మ చెరువును అభివృద్ధి చేసే బాధ్యత తనది అని హామీ ఇచ్చారు కేసీఆర్. మల్కపేట రిజర్వాయర్‌ పనులు పూర్తి చేసుకుని రాజేశ్వరరావు పేరు పెట్టుకున్నామని, ఎన్నికల తర్వాత తానే వచ్చి దాన్ని ప్రారంభిస్తానన్నారు. అభివృద్ధి జరుగుతున్న సమయంలో కాంగ్రెస్‌ కు ఓటేస్తే మళ్లీ మోసపోతామన్నారు కేసీఆర్.

ఇందిరమ్మ రాజ్యంలో సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాలను కల్లోలిత ప్రాంతాలుగా గుర్తించి, యువకులను కాల్చి చంపారని గుర్తు చేశారు కేసీఆర్. అప్పుడు భయంకరమైన పరిస్థితులు ఉండేవని, కాంగ్రెస్ వాళ్లు మళ్లీ ఇందిరమ్మ రాజ్యం అంటున్నారని, ఎవరి కొంప ముంచడానికి అని మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యం బాగుంటే ఎన్టీఆర్ కిలో 2 రూపాయల బియ్యం పథకం ఎందుకు తెచ్చేవారని ప్రశ్నించారు కేసీఆర్. ప్రజా సంక్షేమం విషయంలో గానీ, రైతుల విషయంలో గానీ, అభివృద్ధి విషయంలో గానీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తుందన్నారు.


First Published:  26 Nov 2023 1:52 PM GMT
Next Story