Telugu Global
Telangana

ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గం మినీ ఇండియా..

ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గం మినీ ఇండియా..
X

పటాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గం కుత్బుల్లాపూర్ లాగా మినీ ఇండియా అని చెప్పారు సీఎం కేసీఆర్. ఇక్కడ అన్ని రాష్ట్రాల ప్ర‌జ‌లు ఉంటారని, ఉత్త‌ర భార‌తీయులు కూడా ఇక్కడ ఉంటారన్నారు. ప‌రిశ్ర‌మ‌ల య‌జ‌మానులు అందులో ప‌ని చేసే కార్మికులు కూడా ఇతర ప్రాంతాల వారు ఉంటారని రోజు రోజుకీ ఇది విస్తరించుకుంటూ పోతోందన్నారు. పటాన్ చెరు మీదనుంచి పోయే ఔట‌ర్ రింగ్ రోడ్డు వ‌ర‌కు మెట్రో రైలు తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నామని వివరించారు. మెట్రో వ‌స్తే ప‌టాన్‌ చెరు ద‌శ‌నే మారిపోతుందన్నారు. ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన.. మహిపాల్ రెడ్డిని మరోసారి గెలిపించాలని ప్రజలను కోరారు.


రాష్ట్రంలో ప‌రిశ్ర‌మ‌ల‌కు 24 గంట‌ల క‌రెంట్ ఇవ్వ‌డం వ‌ల్ల కార్మికుల సంపాద‌న పెరిగిందని, కార్మికులు డ‌బుల్ డ్యూటీలు చేసుకుని, కొద్దో గొప్పో మిగుల్చుకుంటున్నారని కేసీఆర్ తెలిపారు. కాంగ్రెస్ హయాంలో కరెంటు లేదని, మంచి నీళ్లు, సాగునీళ్లు లేవని, రాష్ట్రమంతా కూడా బాధలేనని చెప్పారు. రైతుల ఆత్మ‌హ‌త్య‌లు, చేనేత‌ల ఆక‌లిచావులు, వ‌ల‌స‌పోయిన బిడ్డ‌లు.. ఇదే పరిస్థితి అని వివరించారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని, పొరపాటున కాంగ్రెస్ కి ఓటేస్తే.. మళ్లీ అలాంటి కష్టాలు తప్పవని హెచ్చరించారు.

గ‌తంలో తాను పటాన్ చెరు వ‌చ్చిన‌ప్పుడు ఆర్డీవో ఆఫీస్, స‌బ్ రిజిస్ట్రార్ ఆఫీస్, ఐటీఐ కాలేజీ కావాల‌ని కోరారని.. ఆ తెల్లారే తాను జీవో ఇచ్చానని గుర్తు చేశారు కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీకి గులాం కాదని, ఢిల్లీలో తమకు ఎవ‌రూ బాస్ ఉండ‌రని, తెలంగాణ ప్ర‌జ‌లే తమకు బాసులని పేర్కొన్నారు. ప‌టాన్‌ చెరులో కాలుష్యం ఇంకా త‌గ్గాలని, ఆ దిశగా తాము ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు కేసీఆర్. కాలుష్యం త‌గ్గేందుకు కాలుష్య ర‌హిత ప‌రిశ్ర‌మ‌లను ప్రోత్స‌హిస్తున్నామన్నారు. గతంలో కంటి వెలుగు అద్దాలు చైనా నుంచి తెప్పించేవారమని, ఇప్పుడవి పటాన్ చెరులోనే తయారవుతున్నాయని చెప్పారు. ఐటీ పరిశ్రమలు కూడా ఇక్కడకు వస్తున్నాయని చెప్పా కేసీఆర్.

First Published:  23 Nov 2023 4:17 PM GMT
Next Story