Telugu Global
Telangana

వాళ్లకు ఎమోషన్స్‌ లేవా? ప్రేమలు లేవా?

ప్రజా సంక్షేమం కోసం పని చేస్తున్న వారిని గెలిపించి ప్రోత్సహించాలని ప్రజలకు పిలుపునిచ్చారు కేసీఆర్. ఒరవడిలోపడి కొట్టుకుపోవద్దు, గెలిపిస్తే ఇంకా చేయాలని అనిపిస్తుంది అని అన్నారు.

వాళ్లకు ఎమోషన్స్‌ లేవా? ప్రేమలు లేవా?
X

తరతరాలుగా దళితజాతి అణచివేతకు గురవుతోందని ఇంకెన్ని యుగాలు అలా ఉండాలని.. దళిత బిడ్డలు, దళిత మేథావులు ఈ విషయంపై ఆలోచించాలని చెప్పారు సీఎం కేసీఆర్. మిర్యాలగూడ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన.. దేశంలో ఏ నాయకుడూ, ఏ ప్రభుత్వం చేయలేని పని తాము చేశామని, దళితబంధు అనే పథకాన్ని తీసుకొచ్చామని గుర్తు చేశారు. దళితులు మన తోటి మనుషులు కారా..? వారికి గౌరవంగా బతకాలనే కోరికలు ఉండవా..? వాళ్లకు ఎమోషన్స్‌ లేవా? ప్రేమలు లేవా? అని ప్రశ్నించారు కేసీఆర్.


ప్రజా సంక్షేమం కోసం పని చేస్తున్న వారిని గెలిపించి ప్రోత్సహించాలని ప్రజలకు పిలుపునిచ్చారు కేసీఆర్. ఒరవడిలోపడి కొట్టుకుపోవద్దు, గెలిపిస్తే ఇంకా చేయాలని అనిపిస్తుంది అని అన్నారు. రైతుబంధు, మిషన్ భగీరథ వంటి పథకాలతో అన్ని వర్గాలకు న్యాయం చేశామన్నారు. ఈసారి భాస్కర్‌ రావును లక్ష ఓట్ల మెజారిటీతో గెలిస్తే భాస్కర్‌ రావు కోరిన కోర్కెలు నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు పవర్‌ప్లాంట్‌ లో ఉద్యోగాలు వచ్చేలా చేయిస్తానన్నారు. మంచిపనుల కోసం తపించే మంచి నాయకులను గెలిపించాలన్నారు.

70 సంవత్సరాల నుంచి మనకన్నా పెద్ద రాష్ట్రాలున్నాయని, కేవలం పది సంవత్సరాల చిన్న వయసున్న తెలంగాణ ఈ రోజు తలసరి ఆదాయంలో దేశంలోనే నెంబర్-1 స్థానంలో నిలిచిందని చెప్పారు కేసీఆర్. తలసరి విద్యుత్‌ వినియోగం, మంటినీటి సరఫరాలో రాష్ట్రం నెంబర్-1 స్థానంలోనే ఉందన్నారు. సాగునీళ్ల బాధ రాబోయే రెండేళ్లలో తీరిపోతుందని చెప్పారు. పేదలు, నిరుపేదలు, రైతాంగాన్ని వెంబడేసుకొని కొనసాగుతున్న ఈ ప్రయాణం ఇదేవిధంగా కొనసాగితే మంచిదని.. వేరేవాళ్లు వస్తే అలజడి చెలరేగుతుందన్నారు కేసీఆర్.

First Published:  31 Oct 2023 2:44 PM GMT
Next Story