Telugu Global
Telangana

ఆయన పట్టుదల ఉన్న వ్యక్తి.. అన్నీ పట్టుబట్టి సాధిస్తారు

మీ తలరాత మీ చేతుల్లోనే ఉంది, జాగ్రత్తగా ఓటు వేయండి అని చెప్పారు సీఎం కేసీఆర్. 50 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్.. పాలమూరు జిల్లాను బొంబాయి బస్సులకు ఆలవాలం చేసిందని మండిపడ్డారు.

ఆయన పట్టుదల ఉన్న వ్యక్తి.. అన్నీ పట్టుబట్టి సాధిస్తారు
X

మంత్రి శ్రీనివాస్ గౌడ్ పట్టుదల ఉన్న వ్యక్తి అని, నియోజకవర్గానికి కావాల్సినవన్నీ పట్టుబట్టి సాధించుకుంటారని చెప్పారు సీఎం కేసీఆర్. సీఎంఆర్‌ఎఫ్‌ నిధులు రూ.30కోట్లు తీసుకొచ్చి నియోజకవర్గ ప్రజలకు పంచారని అన్నారు. ఐటీ టవర్‌ కావాలంటే వెంటనే మంజూరు చేశామని, రూ.10వేలకోట్లతో అమర్‌ రాజా బ్యాటరీ కంపెనీ వచ్చిందంటే అందులో శ్రీనివాస్‌ గౌడ్‌ కృషి ఎంతో ఉందన్నారు. పాత పాలమూరు జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వచ్చాయన్నారు. శ్రీనివాస్‌గౌడ్‌ ఆధ్వర్యంలో మహబూబ్‌ నగర్‌ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు కేసీఆర్.


మీ తలరాత మీ చేతుల్లోనే..

మంచివాళ్లు గెలిస్తేనే మంచి జరుగుతుందని, చెడ్డవాళ్లు గెలిస్తే మళ్లీ మొదటికే మోసం వస్తుందన్నారు సీఎం కేసీఆర్. మీ తలరాత మీ చేతుల్లోనే ఉంది, జాగ్రత్తగా ఓటు వేయండి అని చెప్పారు. 50 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్.. పాలమూరు జిల్లాను బొంబాయి బస్సులకు ఆలవాలం చేసిందని మండిపడ్డారు. మంచినీళ్లివ్వలేదని, సాగునీరివ్వలేదని, కరెంటు కూడా ఇవ్వలేదన్నారు. చేనేత కార్మికుల ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు, వలసలు.. కాంగ్రెస్ హయాంలో జరిగింది ఇదేనన్నారు కేసీఆర్.

మున్సిపల్ కమిషనర్ గా ఉన్న శ్రీనివాస్‌ గౌడ్‌.. రాజీనామా చేసి ఉద్యమంలో దూకారని, ఉద్యోగులు రోడ్లమీదకు వచ్చారని, చివరకు తాను చావుకి సిద్ధపడి ఆమరణ నిరాహార దీక్ష చేస్తే తెలంగాణ వచ్చిందన్నారు కేసీఆర్. అధికారంలోకి వచ్చాక పేదల సంక్షేమం కోసం పెన్షన్లు పెంచుకున్నామని, ఈసారి అధికారంలోకి వస్తే రూ.5వేలకు తీసుకుపోతామని హామీ ఇచ్చారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, అమ్మఒడి వాహనాలు, కంటి వెలుగు వంటి ఎన్నో పథకాలు తీసుకొచ్చామని చెప్పారు కేసీఆర్.

శ్రీనివాస్‌ గౌడ్‌ గెలిస్తేనే ఉచిత కరెంటు ఉంటుందని, లేకపోతే దాన్ని కాంగ్రెస్‌ కాకి ఎత్తుకుపోతుందన్నారు కేసీఆర్. 3 గంటలు కరెంటు చాలు 10హెచ్.పి. మోటర్లు పెట్టుకోండి అంటూ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని, ఆ మోటర్లు వాళ్ల అయ్య ఇస్తాడా అని ప్రశ్నించారు. కరెంటు ఇవ్వడం వారికి చేతకాదు, వారికి తెలివి లేదు. ఇచ్చేవాడు వస్తే దాన్ని కూడా ఎటమటం చేయాలని మాట్లాడుతున్నారని మండిపడ్డారు కేసీఆర్.

First Published:  22 Nov 2023 1:00 PM GMT
Next Story