Telugu Global
Telangana

ప్రజలు మనతోనే ఉన్నారు.. ఈ నెల 30న తమాషా చూపెడతారు

ప్రజా ఆశీర్వాద సభ జరిగిన ఎస్‌ఆర్‌ఆర్‌ కాలేజీ గ్రౌండ్‌ లో 2011 మే 17న తెలంగాణ మొట్టమొదటి సింహగర్జన సభ జరిగిందని గుర్తు చేశారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం తీసుకరాలేకపోయినా, ఉద్యమాన్ని విరమించినా.. నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని నాడు ఆ సభలో తాను చెప్పానన్నారు కేసీఆర్. ఇచ్చిన మాట ప్రకారమే తెలంగాణ తెచ్చి చూపించానన్నారు.

ప్రజలు మనతోనే ఉన్నారు.. ఈ నెల 30న తమాషా చూపెడతారు
X

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఇప్ప‌టికే సగం తెలంగాణ తిరిగానని, కచ్చితంగా బీఆర్ఎస్ గ‌వ‌ర్న‌మెంటే వ‌స్తుందని ధీమా వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. ప్ర‌జ‌లు మ‌న‌తో ఉన్నారని, ఈ నెల 30న త‌మాషా చూపెడతారని కరీంనగర్ సభలో ఆయన చెప్పారు. ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన, మంత్రి గంగుల కమలాకర్ కి భారీ మెజార్టీ ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎవరు ఏది అన్నా, ఎవరు ఏడ్చినా.. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు కేసీఆర్.


కాంగ్రెస్‌ దోకాబాజ్‌ పార్టీ అని ఎద్దేవా చేశారు కేసీఆర్. ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఇక్కడి ప్రజలను 58 ఏండ్లు ఏడిపించిన పార్టీ అది అన్నారు. తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి ఎన్నో విజయాలకు కరీంనగర్‌ గడ్డ కేంద్ర బిందువుగా ఉందని సీఎం గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమానికి, ప్రజలకు, వ్యక్తిగతంగా తనకు ఎన్నో విజయాలను కరీంనగర్‌ అందించిందన్నారు. ప్రజా ఆశీర్వాద సభ జరిగిన ఎస్‌ఆర్‌ఆర్‌ కాలేజీ గ్రౌండ్‌ లో 2011 మే 17న తెలంగాణ మొట్టమొదటి సింహగర్జన సభ జరిగిందని గుర్తు చేశారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం తీసుకరాలేకపోయినా, ఉద్యమాన్ని విరమించినా.. నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని నాడు ఆ సభలో తాను చెప్పానన్నారు కేసీఆర్. ఇచ్చిన మాట ప్రకారమే తెలంగాణ తెచ్చి చూపించానన్నారు.

దళితబంధు, రైతుబంధు, రైతు బీమా లాంటి అనేక మంచి కార్యక్రమాలను కరీంనగర్‌ వేదిక నుంచే ప్రారంభించుకున్నామని చెప్పారు సీఎం కేసీఆర్. తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే నెంబర్-1 గా ఉందన్నారు. కడుపు నోరు కట్టుకుని, ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నం కాబట్టి ఈరోజు ఈ స్థాయికి వచ్చామన్నారు. ప్రజలు ఓటు వేసేముందు ఆలోచించాలన్నారు కేసీఆర్.

First Published:  17 Nov 2023 10:18 AM GMT
Next Story