Telugu Global
Telangana

జీవన్ రెడ్డి నామీద అలిగాడు.. ఎందుకంటే..?

అంకాపూర్ అంటే తనకు ప్రాణం అని, ఆ ప్రాంతం గురించి తనకంటే ఎవరూ ఎక్కువగా ప్రచారం చేసి ఉండరని చెప్పారు సీఎం కేసీఆర్. వారిని స్ఫూర్తిగా తీసుకుని వంద‌లాది గ్రామాలు ఆర్థికంగా ఎదుగుతున్నాయని చెప్పారు.

జీవన్ రెడ్డి నామీద అలిగాడు.. ఎందుకంటే..?
X

ఆర్మూరు ప్రజా ఆశీర్వాద సభలో స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మరోసారి ఓటు వేయాలని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. జీవన్ రెడ్డి స్పెషాలిటీ ఏంటో సభలో వివరించారు. తెలంగాణ ఉద్య‌మంలో ఉండి, ఎర్ర జొన్న రైతుల‌కు కోసం జీవన్ రెడ్డి ఆమ‌రణ దీక్ష చేశారని గుర్తు చేశారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ రైతులపై కాల్పులు జరిపిందన్నారు. ఆ సమయంలో తాను కరీంనగర్ పర్యటనలో ఉన్నానని.. విషయం తెలిసి వెంటనే ఆర్మూరుకి వచ్చానన్నారు. ఆ సంఘటన తర్వాత జీవన్ రెడ్డి తన కుటుంబ సభ్యుడిగా మారారని గుర్తు చేశారు కేసీఆర్. రైతులకు అండగా నిలబడిన జీవన్ రెడ్డి.. ఆ తర్వాత రైతులకోసం ఎంతో కృషి చేశారని చెప్పారు.


3రోజులు అలిగారు..

జీవ‌న్ రెడ్డి ఏదైనా కావాలంటే.. పట్టుబట్టి సాధిస్తారని తెలిపారు సీఎం కేసీఆర్. మండ‌లాలు కావాలని అడిగారని.. అవ‌స‌ర‌మా అని తాను ప్రశ్నిస్తే మూడురోజులు అలిగి సాధించుకున్నారని చెప్పారు. ప‌ట్టుద‌ల‌తో, పంథాతో న‌మ్ముకున్న ప్ర‌జ‌ల కోసం ప‌నులు చేయించుకుంటారు జీవన్ రెడ్డి అని తెలిపారు. ఆయనపై ఆర్మూరు ప్రజల నమ్మకం ఈ సభలో కనపడుతోందని.. ఆయనను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు కేసీఆర్. కొంతమంది ఇప్పుడొచ్చి ఆప‌ద‌మొక్కులు మొక్కుతారని, అవ‌న్నీ న‌మ్మ‌కండని చెప్పారు. ప్ర‌జ‌ల కోసం ప‌ని చేసే వ్య‌క్తి జీవన్ రెడ్డి అని అన్నారు.

అంకాపూర్ అంటే ప్రాణం..

అంకాపూర్ అంటే తనకు ప్రాణం అని, ఆ ప్రాంతం గురించి తనకంటే ఎవరూ ఎక్కువగా ప్రచారం చేసి ఉండరని చెప్పారు సీఎం కేసీఆర్. అంతమంచి అభ్యుద‌య‌మైన రైతుల్ని స్ఫూర్తిగా తీసుకుని వంద‌లాది గ్రామాలు ఆర్థికంగా ఎదుగుతున్నాయని చెప్పారు. అంకాపూర్ రైతాంగ శ్రమను ప్రశంసించారు. అలాంటి రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు కేసీఆర్. తెలంగాణ మినహా దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా రైతులకు 24గంటలు విద్యుత్ ఇవ్వడంలేదని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో నీటి తీరువా పన్నులు కట్టాల్సి ఉంటుందని, తెలంగాణలో లిఫ్ట్ ల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నా.. ఎక్కడా పన్నులు లేవని చెప్పారు. వ్యవసాయ స్థిరీకరణకోసం తాను చేసిన ప్రయత్నానికి ఇప్పుడు మంచి ఫలితాలు కనపడుతున్నాయని అన్నారు కేసీఆర్. ఆలోచించి వివేచనతో ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

First Published:  3 Nov 2023 12:22 PM GMT
Next Story