Telugu Global
Telangana

అప్పిచ్చువాడు, వైద్యుడు.. కేసీఆర్ ఇంకా ఏం చెప్పారంటే..?

ప్రభుత్వ దవాఖానల్లో సామర్థ్యానికి మించి రోగులు వచ్చినా డాక్టర్లు వైద్యం అందిస్తున్నారని తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రులు చేతులెత్తేసినా కరోనా రోగులను గాంధీ వైద్యులు కాపాడారని గుర్తుచేశారు కేసీఆర్.

అప్పిచ్చువాడు, వైద్యుడు.. కేసీఆర్ ఇంకా ఏం చెప్పారంటే..?
X

అప్పు ఇచ్చేవారు, వైద్యులు ఉండే ఊరిలోనే నివాసం ఉండాలనే సుమతీ శతక పద్యాన్ని గుర్తు చేశారు సీఎం కేసీఆర్. నిమ్స్ లో దశాబ్ది బ్లాక్ శంకుస్థాపన అనంతరం సభలో మాట్లాడిన ఆయన.. వైద్యుల గొప్పదనాన్ని వివరించారు. ఎంత చేసినా వైద్యారోగ్యశాఖకు సహజంగా విమర్శలే ఎక్కువగా ఉంటాయని, ప్రశంసలు తక్కువని చెప్పారు. ప్రభుత్వ దవాఖానల్లో సామర్థ్యానికి మించి రోగులు వచ్చినా డాక్టర్లు వైద్యం అందిస్తున్నారని తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రులు చేతులెత్తేసినా కరోనా రోగులను గాంధీ వైద్యులు కాపాడారని గుర్తుచేశారు. అందుకే తమ ప్రభుత్వం వైద్యులను గౌరవిస్తుందని, మూరుమూల ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యాలు అందిస్తోందని చెప్పారు. గతంలో దవాఖానల్లో 30 శాతం మాత్రమే కాన్పులు జరిగేవని, ఇప్పుడు 70 శాతానికి పెరిగాయన్నారు సీఎం కేసీఆర్.

2014లో వైద్యరంగానికి బడ్జెట్‌ లో రూ.2001 కోట్లు కేటాయించామని, 2023-24 నాటికి అది రూ.12,367 కోట్లకు చేరిందని వెల్లడించారు సీఎం కేసీఆర్. ప్రస్తుతం మనం 550 టన్నుల ఆక్సిజన్‌ ను సొంతంగా ఉత్పత్తి చేసుకుంటున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో కరోనాను మించిన వైరస్‌ లు వస్తాయని నిపుణులు హెచ్చరించారని, వైద్యరంగం బలంగా ఉంటే తక్కువ నష్టంతో ఆ విపత్తులను ఎదుర్కోవచ్చని అన్నారు కేసీఆర్. అందుకే వైద్యరంగాన్ని రాష్ట్రంలో బలోపేతం చేస్తున్నామని వెల్లడించారు.


వైద్యానికి మానవ జీవితానికి ఎడతెగని సంబంధం ఉందని అన్నారు సీఎం కేసీఆర్. మానవజాతి ఉన్నంత కాలం వైద్యులు ఉంటారని చెప్పారు. పిల్లల పెరుగుదలలో సమస్యలు ఉండకూడదనే ఉద్దేశంతో న్యూట్రిషన్‌ కిట్లు అందిస్తున్నామని చెప్పారు. వీటి ద్వారా సంపూర్ణ పోషకాలు అందడం వల్ల ఒక తరం ఆరోగ్యకరంగా ఉంటుందని వెల్లడించారు.

గతంలో ఉస్మానియా, గాంధీ, నీలోఫర్‌ వంటి ఆస్పత్రులే అందరికీ దిక్కుగా మారేవని, ఇప్పుడు వరంగల్‌ లో ప్రపంచంలోనే అద్భుతమైన హెల్త్‌ సిటీని కడుతున్నామని చెప్పారు కేసీఆర్. హైదరాబాద్‌లో మరో 4 ఆస్పత్రులు కడుతున్నామని వెల్లడించారు. రాష్ట్ర ప్రజలకు ఉత్తమ సేవలు అందించడానికి కృషి చేస్తున్నామని అన్నారు.

First Published:  14 Jun 2023 10:00 AM GMT
Next Story