Telugu Global
Telangana

నా అంచ‌నాలు ఎప్పుడూ త‌ప్ప‌లేదు.. చ‌రిత్ర చూడండి.. - కేసీఆర్‌

ఈ దేశంలో అద్భుతమైన పరివర్తన రావడానికి, దేశ రాజకీయాల్లో, ప్రజల ఆలోచన విధానాల్లో, ఆర్థిక పురోగతిలో మార్పు రావడానికి, దేశాన్ని అద్భుతమైన ప్రపంచ ఎకానమీగా తీర్చిదిద్దడానికి అవసరమైన గుణాత్మక మార్పు కోసం నా ప్రాణాలొడ్డయినా పోరాటం చేస్తా.

నా అంచ‌నాలు ఎప్పుడూ త‌ప్ప‌లేదు.. చ‌రిత్ర చూడండి.. - కేసీఆర్‌
X

తెలంగాణ కొత్త సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేద్కర్ పేరు పెట్టడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ స్థాయిలో మరోసారి మార్మోగిపోతున్నారు. కేసీఆర్, సంచలనం కవల పిల్లలు. ఆయన మాట్లాడినా సంచలనమే. మౌనంగా ఉన్నా సంచలనమే. ఆయన ఆలోచనలు సంచలనమే. ఆయన నిర్ణయాలు సంచలనమే. ఆయన సంచలన నిర్ణయం తీసుకుంటారా లేక తీసుకున్న నిర్ణయం సంచలనం అవుతుందా? అన్నది అంతుచిక్కనిది.

సెక్రెటేరియట్ కు అంబేద్కర్ పేరు పెట్టినప్పుడు ప్రజల్ని, సమాజాన్ని ఎట్లా మెప్పించగలరో.. కొత్త రాజ్యాంగాన్ని నిర్మించవలసిందేనని కూడా ఆయన కన్విన్సు చేయగలరు. ప్రస్తుత రాజ్యాంగం వలన దేశ అవసరాలు తీరవని కేసీఆర్ ఎనిమిది నెలల కిందట వ్యాఖ్యానించినప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశ వ్యాప్తంగానూ దుమారం రేగింది.ప్రత్యర్థులు కేసీఆర్ పై టన్నుల కొద్దీ దుమ్మెత్తి పోశారు. అంబేద్కర్ ను అవమానించారంటూ ముఖ్యమంత్రిని తీవ్ర పదజాలంతో దూషించారు. అయినా ఆయన భరించారు..'నెగెటివ్'గానూ జాతీయస్థాయిలో చర్చ జరుగుతుందని కేసీఆర్ కు తెలియదని అనుకుంటే అది మన అమాయకత్వం. ఎనిమిదేండ్లుగా తెలంగాణలో సంక్షేమ పథకాల స్వైరవిహారంతో ఆయన ఇదివరకే జాతీయస్థాయి వార్తల్లో కెక్కారు. కొత్తగా వార్తల్లో ఉండడానికి ఆయన వెంపర్లాడవలసిన పని లేదు. నిర్మాణంలో ఉన్న తెలంగాణ సెక్రెటేరియట్ కు అంబేద్కర్ పేరు పెట్టాలని ఒకరు సూచిస్తేనో,లేదా మరొకరు ఒత్తిడి చేస్తేనో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకుంటారని అనుకోలేం. ఆయనకు ఆలోచన వస్తేనే నిర్ణయం తీసుకుంటారు తప్ప ఆయన వద్దనుకున్నపుడు హరిహరాదులు వచ్చి ఒత్తిడి చేసినా ఒప్పుకునే రకం కాదు.


''నయా సోచ్.. నయా దిశ.. నయా సంవిధాన్. ప్రస్తుత రాజ్యాంగాన్ని పునర్ నిర్వచించాలి. పునర్ లిఖించాలి. నూతన రాజ్యాంగాన్ని నిర్మించాలి. 75 ఏళ్ల రాజ్యాంగం ఈనాటి దేశ అవసరాలను తీర్చడం లేదు. దేశానికి కొత్త రాజ్యాంగం డ్రాప్ట్‌ చేయాల్సిన అవసరమున్నది. చాలా దేశాలు తప్పనిసరి అనుకొన్నప్పుడు రాజ్యాంగాలను తిరిగి రాసుకొన్నాయి. కొత్త రాజ్యాంగాలను తీసుకొచ్చాయి. ఇప్పుడు మన దేశంలోనూ కొత్త రాజ్యాంగం తీసుకురావాలి. ప్రస్తుత సామాజిక పరిస్థితులకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవాలె. అందులో తప్పేమీ లేదు. ఇప్పటికే రాజ్యాంగం 88 సార్లు సవరించుకున్నం. రాజ్యాంగాన్ని సవరించుకోవడం కన్నా కొత్త రాజ్యాంగాన్ని రాసుకోవడమే ఉత్తమం. ప్రస్తుత రాజ్యాంగం రాష్ట్రాలకు కొన్ని హక్కులను కల్పించింది. అదేవిధంగా కేంద్రానికి కూడా ఇచ్చింది. కానీ కేంద్రం రాష్ట్రాల హక్కులన్నింటినీ హరిస్తున్నది. కేంద్రం రాష్ట్రాలకు మరిన్ని అధికారాలను కల్పించాలి.అధికార వికేంద్రీకరణకు బదులు రోజురోజుకూ అధికార కేంద్రీకరణ దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నది. కాంగ్రెస్ కూడా గతంలో ఇదే విధానాన్ని అవలంబించింది.ఈ దేశంలో ఒక పరివర్తన, గుణాత్మకమైన మార్పు, ప్రబలమైన మార్పు రావాల్సిన అవసరముంది.

నేను చెప్పేది ఎప్పుడైనా చరిత్రనే అయ్యింది. అది చెప్పడానికి ఆత్మవిశ్వాసం, ధైర్యం కావాలి. ఒకప్పుడు నేను చెప్పిన.. ఇలా చెప్పడానికి సాహసం కావాలె.. ఒకప్పుడు నేను ఆ సాహసం చేసిన. హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి పోతున్నా. తిరిగి తెలంగాణ రాష్ట్రంలోనే అడుగుపెడుతా అని చెప్పిన.. మళ్ల తెలంగాణ రాష్ట్రంలోనే అడుగు పెట్టిన.. ఇప్పుడూ చెప్తున్నా.. ఈ దేశంలో అద్భుతమైన పరివర్తన రావడానికి, దేశ రాజకీయాల్లో, ప్రజల ఆలోచన విధానాల్లో, ఆర్థిక పురోగతిలో మార్పు రావడానికి, దేశాన్ని అద్భుతమైన ప్రపంచ ఎకానమీగా తీర్చిదిద్దడానికి అవసరమైన గుణాత్మక మార్పు కోసం నా ప్రాణాలొడ్డయినా పోరాటం చేస్తా. ఎవరైతే లీడ్‌ చేస్తరో వాళ్లే లీడర్‌'' అని కేసీఆర్ గతంలో చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోలేదు. అదే కేసీఆర్ నైజం. జాతీయస్థాయి రాజకీయాల్లో ఆయన 'క్షిపణు'లను ప్రయోగిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి అమ్ములపొదిలో ఇలాంటి ఎన్నో క్షిపణులు సిద్ధంగా ఉండవచ్చు. లేదా అప్పటికప్పుడే ఆయన క్షిపణిని తయారు చేసి సంధించే సాహసమూ చేయగలరు.

First Published:  16 Sep 2022 2:20 AM GMT
Next Story