Telugu Global
Telangana

కాంగ్రెస్‌ గెలిచే సీట్లు ఎన్నో తెలుసా- కేసీఆర్‌

పట్టి లేని భట్టి విక్రమార్కకు ఓటేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు కేసీఆర్. నియోజకవర్గానికి చుట్టపు చూపులా ఆరు నెలలకోసారి వస్తారంటూ భట్టిపై విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్‌ గెలిచే సీట్లు ఎన్నో తెలుసా- కేసీఆర్‌
X

ప్రజా ఆశీర్వాద సభలతో దూసుకెళ్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌.. కాంగ్రెస్‌ టార్గెట్‌గా రోజురోజుకూ విమర్శల దాడి పెంచుతున్నారు. ఇవాళ సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న మధిరలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు కేసీఆర్ హాజరయ్యారు. ఇప్పటివరకూ తాను 70 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించానన్న కేసీఆర్‌.. కాంగ్రెస్‌ 20 సీట్ల కంటే ఎక్కువ గెలిచే అవకాశాలు లేవన్నారు.

మధిర నియోజకవర్గ పరిధిలోని చింతకాని మండలాన్ని దళితబంధు పైలెట్ ప్రాజెక్టు కింద తీసుకున్నామని.. ఇవాళ చింతకాని బాగుపడిందన్నారు. పట్టి లేని భట్టి విక్రమార్కకు ఓటేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు కేసీఆర్. నియోజకవర్గానికి చుట్టపు చూపులా ఆరు నెలలకోసారి వస్తారంటూ భట్టిపై విమర్శలు గుప్పించారు. ఓడిపోతామని తెలిసే కాంగ్రెస్‌ కొత్త డ్రామాలకు తెరతీసిందన్నారు. కాంగ్రెస్‌లో 12 మంది ముఖ్యమంత్రి ఆశావహులున్నారని.. కానీ ఆ పార్టీ గెలిచే అవకాశాలు లేవన్నారు కేసీఆర్.

గతంతో పోలిస్తే ఖ‌మ్మం జిల్లాలో బీఆర్ఎస్‌కు రెండు సీట్లు అధికంగానే వస్తాయన్నారు కేసీఆర్. కమల్‌రాజ్‌ను గెలిపిస్తే మధిర ప్రజలు బాగుపడతారని.. భట్టి విక్రమార్కతో వచ్చేది ఏం లేదు.. పోయేది ఏం లేదన్నారు. భట్టి ముఖ్యమంత్రి అవడం ఏమో కానీ.. ఎమ్మెల్యేగా గెలవడం కూడా కష్టమేనన్నారు. ఏ ఒక్క దళితుడు కూడా భట్టి విక్రమార్కకు ఓటు వేయొద్దని కోరారు కేసీఆర్.

First Published:  21 Nov 2023 11:02 AM GMT
Next Story