Telugu Global
Telangana

పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుపై కేసీఆర్‌ సమీక్ష

పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు (PRLI)పై సమీక్షా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి, ‘కన్వేయర్‌ సిస్టమ్‌’ ద్వారా ఒక రిజర్వాయర్‌ నుంచి మరో రిజర్వాయర్‌కు నీటిని తరలించే పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుపై కేసీఆర్‌ సమీక్ష
X

సోమవారం కొత్త సచివాలయంలో జరిగిన తొలి సమావేశంలో కరివెన రిజర్వాయర్‌ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి జూలై నాటికి నీటిని తరలించి ఆగస్టు నాటికి ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ వరకు నీటిని ఎత్తిపోయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించారు.

పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు (PRLI)పై సమీక్షా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి, ‘కన్వేయర్‌ సిస్టమ్‌’ ద్వారా ఒక రిజర్వాయర్‌ నుంచి మరో రిజర్వాయర్‌కు నీటిని తరలించే పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తాండూరు, పరిగి, వికారాబాద్, కొడంగల్, చేవెళ్ల నియోజకవర్గాల్లో తాగునీటి అవసరాల కోసం కాల్వలు తవ్వేందుకు టెండర్లు పిలవాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.

పాలమూరు-రంగారెడ్డి లిఫ్టుల్లో అంతర్భాగంగా నిర్మిస్తున్న కరివెన, ఉదండాపూర్ రిజర్వాయర్ల నుంచి నారాయణపేట, కొడంగల్, వికారాబాద్ వరకు కాల్వలు తవ్వేందుకు సంబంధించిన దస్త్రాలపై ఆదివారం నాడే ఆయన సంతకం చేశారు.

PRLI ప్రాజెక్టులో భాగంగా కరివెన రిజర్వాయర్‌ను నిర్మిస్తున్నామ‌ని, ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. ఈ పథకంలో భాగంగా వికారాబాద్, నారాయణపేట జిల్లాలకు ఉదండాపూర్ రిజర్వాయర్ నుంచి తాగునీరు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.న్యాయపరమైన చిక్కుముళ్ల వల్ల‌ కొన్ని నెలల క్రితం రిజర్వాయర్ పనులు ఆగిపోయి పనులు ఆలస్యమయ్యాయి.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో తాగునీటి పనులు కొనసాగించేందుకు సుప్రీంకోర్టు అనుమతించిన నేపథ్యంలో గతంలో మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో జరుగుతున్న తాగునీటి సరఫరా పనుల పురోగతిపైనా ముఖ్యమంత్రి చర్చించారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ పనుల పురోగతిని సమీక్షించిన ముఖ్యమంత్రి మిగిలిన పనులను జూన్‌లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

First Published:  2 May 2023 2:31 AM GMT
Next Story