Telugu Global
Telangana

ఇకపై ఆక్రమణలు జరగవని హామీ ఇస్తేనే పోడు భూముల పట్టాలు: సీఎం కేసీఆర్

‘‘అటవీ భూములను ఆక్రమణలకు గురి చేస్తే సహించేది లేదు. గిరిజనులు అటవీ భూములు తమ హక్కు అని వాదిస్తే భవిష్యత్తులో అటవీ భూములు ఉండవని, రాజకీయ సమస్యలు సృష్టించేందుకు కొందరు నాయకులు ప్రయత్నిస్తున్నారని, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గుత్తికోయలను ఇక్కడికి తీసుకొచ్చి అటవీ భూముల్లో సమస్యలు సృష్టిస్తున్నారు.''అని కేసీఆర్.

ఇకపై ఆక్రమణలు జరగవని హామీ ఇస్తేనే పోడు భూముల పట్టాలు: సీఎం కేసీఆర్
X

11.5 లక్షల ఎకరాల‌ పోడు భూములకు ఈ నెలాఖరు లేదా మార్చి మొదటి వారంలో పట్టాలు పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.

అయితే ఇకపై అటవీ భూములను ఆక్రమణ చేయబోమంటూ గ్రామ కమిటీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, గిరిజన సంఘాల నాయకులు ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా హామీ ఇచ్చిన తర్వాతే లబ్ధిదారులకు పట్టాలు అందజేస్తారు. అంతే కాకుండా అటవీ భూములను సంరక్షించే బాధ్యత కూడా లబ్ధిదారులదే అని శుక్రవారం అసెంబ్లీలో కేసీఆర్ తెలిపారు.

భూమిలేని గిరిజనులు, జీవనోపాధి లేని వారికి దళిత బంధు తరహాలో గిరిజన బందును కూడా ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

ప్రశ్నోత్తరాల సమయంలో పోడు భూములపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సమాధానం ఇస్తున్నప్పుడు ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని ఇకపై అటవీ భూముల ఆక్రమణలకు పాల్పడితే సహించేది లేదన్నారు.

‘‘అటవీ భూములను ఆక్రమణలకు గురి చేస్తే సహించేది లేదు. గిరిజనులు అటవీ భూములు తమ హక్కు అని వాదిస్తే భవిష్యత్తులో అటవీ భూములు ఉండవని, రాజకీయ సమస్యలు సృష్టించేందుకు కొందరు నాయకులు ప్రయత్నిస్తున్నారని, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గుత్తికోయలను ఇక్కడికి తీసుకొచ్చి అటవీ భూముల్లో సమస్యలు సృష్టిస్తున్నారని అన్నారు.

పోడు భూములకు సంబంధించిన అన్ని సర్వేలు పూర్తి చేసి డాటా సిద్ధం చేశారు. తెలంగాణ ప్రభుత్వం పట్టాలివ్వడంతో సరిపెట్టదని వారికి రైతు బంధు, విద్యుత్ కనెక్షన్‌లను కూడా ఇస్తామ‌ని తెలిపారు.

గతంలో హద్దులు నిర్ణయించకుండానే ప్రభుత్వాలు విరివిగా సర్టిఫికెట్లు జారీచేశాయని, కొంత మంది రైతులు తమకు కేటాయించిన దానికంటే ఎక్కువ విస్తీర్ణంలో ఆక్రమించుకుంటున్నారని అన్నారు.

ఇది కాకుండా, పోడు భూములను సొంతం చేసుకునేందుకు కొంతమంది అగ్రవర్ణాల వారు గిరిజన మహిళలను వివాహం చేసుకున్నారన్నారని తెలిపారు కేసీఆర్.

ఆదివాసీల మీద ఫారెస్ట్ అధికారులు,పోలీసులు చేపట్టిన చర్యలపై అభ్యంతరాలు లేవనెత్తినందుకు సభలో కొంతమంది సభ్యులను కూడా ముఖ్యమంత్రి తప్పుబట్టారు.

అటవీశాఖ అధికారిపై గిరిజనులు దారుణంగా దాడి చేసి హత్య చేశారు. అటువంటి దాడులను ప్రభుత్వం అనుమతించాలా, రాష్ట్ర ప్రభుత్వం అధికారి కుటుంబానికి ఉద్యోగంతో పాటు రూ.50 లక్షల సహాయం అందించిందని ఆయన అన్నారు.

కొన్ని సమయాల్లో, అటవీ అధికారులు అతిగా స్పందిస్తారు కానీ గిరిజనులు అధికారులపై దాడి చేయకూడదు. పోలీసులు, అటవీశాఖ అధికారులు కూడా చట్ట ప్రకారం, మానవతా దృక్పథంతో వ్యవహరించాలని అన్నారు.

ఈ సందర్భంగా షెడ్యూల్డ్ తెగల్లో మరి కొన్ని వర్గాలను చేర్చే తీర్మానాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రతిపాదించారు.

వాల్మీకి బోయ, బీదర, కిరాతక, నిషాధి, పెద్ద బోయలు, తలయారి, చుండువల్లు, ఖైతీ లంబాడా, భరత్ మథురలు, చమర్ మథురాలను షెడ్యూల్డ్ తెగల్లో చేర్చాలని 2016లో షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) విచారణ కమిషన్ సిఫార్సు చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన జాబితాను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. కానీ ఇంతవరకు ఈ విషయంలో ఎలాంటి స్పందన లేదు’’ అని ముఖ్యమంత్రి అన్నారు.

కావున, ఈ వర్గాలను షెడ్యూల్డ్ తెగల జాబితాలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఇంకా, 'ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో నివసించే మాలి వారిని షెడ్యూల్డ్ తెగల జాబితాలో చేర్చాలని చాలా కాలంగా డిమాండ్ ఉందని, వారి సామాజిక ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, వారిని కూడా షెడ్యూల్డ్ తెగల జాబితాలో చేర్చాలని కూడా ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానించిందని ఆయన తెలిపారు.

First Published:  10 Feb 2023 11:22 AM GMT
Next Story