Telugu Global
Telangana

సాయిచంద్ మృత దేహానికి సీఎం కేసీఆర్ నివాళి.. కుటుంబ సభ్యులను ఓదార్చిన ముఖ్యమంత్రి

సాయిచంద్ భార్య రజని.. సీఎం కేసీఆర్‌ను చూడగానే బోరుల విలపించారు. ఆమెను కేసీఆర్ ఓదార్చి.. అధైర్యపడవద్దని.. కుటుంబానికి పార్టీ, ప్రభుత్వం తరపున అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

సాయిచంద్ మృత దేహానికి సీఎం కేసీఆర్ నివాళి.. కుటుంబ సభ్యులను ఓదార్చిన ముఖ్యమంత్రి
X

తెలంగాణ ఉద్యమకారుడు, గాయకుడు, రాష్ట్ర వేర్‌హౌస్ కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ గుండె పోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. హైదరాబాద్ గుర్రంగూడలో ఉంచిన సాయిచంద్ మృతదేహాన్ని సందర్శంచి.. సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. సాయిచంద్ మృతితో విషాదంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. సాయిచంద్ తండ్రితో మాట్లాడి.. ఆయనకు ధైర్యం చెప్పారు. సాయిచంద్ ఉద్యమ సమయంలో చూపించిన తెగువ, రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేసిన సేవలు మరువ లేనివని గుర్తు చేశారు.

సాయిచంద్ భార్య రజని.. సీఎం కేసీఆర్‌ను చూడగానే బోరుల విలపించారు. ఆమెను కేసీఆర్ ఓదార్చి.. అధైర్యపడవద్దని.. కుటుంబానికి పార్టీ, ప్రభుత్వం తరపున అండగా ఉంటానని హామీ ఇచ్చారు. చిన్న వయసులోనే సాయిచంద్ మృతి చెందడం బాధకరమని సీఎం చెప్పారు. సాయిచంద్ కుటుంబానికి తాను ఉన్నానని భరోసా ఇచ్చారు.

కంటతడి పెట్టిన కేటీఆర్..

సాయిచంద్ మృతి వార్త తెలుసుకున్న వెంటనే మంత్రి కేటీఆర్ గుర్రంగూడలోని ఆయన నివాసానికి వెళ్లారు. అక్కడి సాయి చంద్ మృత దేహాన్ని చూసి కంట తడి పెట్టుకున్నారు. సాయితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించి.. తన సంతాపాన్ని ప్రకటించారు. కేటీఆర్ వెంట మంత్రి సబిత ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, రసమయి బాలకిషన్, టీఎస్ఎమ్మెస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఉన్నారు.

సాయిచంద్ అద్భుతమైన కళాకారుడు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పని చేశాడు. ఆయన మరణం తీరని లోటు. ఉద్యమంలో తన పాటల ద్వారా అందరినీ ఏకం చేశాడు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోకుండా పాటలు పాడారని కేటీఆర్ అన్నారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

కాగా, సాయిచంద్ మృతదేహానికి కొద్ది సేపట్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వనస్థలిపురంలోని సాహెబ్‌నగర్ స్మశాన వాటిలో అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేశారు. గుర్రంగూడ నుంచి సాహెబ్ నగర్ వరకు సాయిచంద్ అంత్యక్రియలు జరుగుతాయని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్పాయి.




First Published:  29 Jun 2023 8:17 AM GMT
Next Story