Telugu Global
Telangana

మతతత్వ శక్తులు అశాంతిని సృష్టించేందుకు కుట్ర చేస్తున్నాయి

తెలంగాణ రాష్ట్రంలో కొన్ని మతతత్వ శక్తులు అశాంతిని సృష్టించి, విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర చేస్తున్నాయని సీఎం కేసీఆర్ ఆరోపించారు. అలాంటి మతోన్మాద శక్తుల నుంచి రాష్ట్ర ప్రజలందరూ అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు.

మతతత్వ శక్తులు అశాంతిని సృష్టించేందుకు కుట్ర చేస్తున్నాయి
X

ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి

మహనీయుల త్యాగాలను మనం గుర్తు చేసుకోవాలి

హైదరాబాద్ ఆనాడే అభివృద్ధి దిశగా సాగింది

ఏపీ ఏర్పడిన దశాబ్దానికే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొదలైంది

నేడు తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచింది

జాతీయ సమైక్యత వ‌జ్రోత్స‌వాల్లో సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో కొన్ని మతతత్వ శక్తులు అశాంతిని సృష్టించి, విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర చేస్తున్నాయని సీఎం కేసీఆర్ ఆరోపించారు. అలాంటి మతోన్మాద శక్తుల నుంచి రాష్ట్ర ప్రజలందరూ అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కరించుకొని హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించిన వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ సువిశాల భారత దేశంలో అంతర్భాగంగా మారిందని, రాచరిక పరిపాలన నుంచి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందిందని సీఎం అన్నారు. ఆ విషయాన్ని గుర్తుకు తెచ్చుకునే ఈ రోజు జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నామని ఆయన అన్నారు.

ఇటీవలే స్వాతంత్ర వజ్రోత్సవాలను ఏ రాష్ట్రం నిర్వహించనంత ఘనంగా మనం 15 రోజుల పాటు నిర్వహించాము. దానికి కొనసాగింపుగానే ఇవాళ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నామని సీఎం చెప్పారు. స్వతంత్రం రాక ముందు భారతదేశ స్వరూపం భిన్నంగా ఉండేది. కొన్ని బ్రిటిష్ ఇండియాలో భాగస్వామ్యంగా ఉంటే.. మిగతా భాగాలు సంస్థానాధీశుల పాలనలో ఉండేవి. దేశంలో కొన్ని ప్రాంతాలు ఫ్రెంచ్, పోర్చుగీసు వారి పాలనలో కూడా ఉండేవి. ప్రపంచంలో ఏ దేశమైనా పరిణామ క్రమంలో సమగ్ర స్వరూపాన్ని సంతరించుకుంది. మన దేశం కూడా అలాగే ఏర్పడిందని కేసీఆర్ చెప్పారు. ఈ ప్రాంతం రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక స్వేచ్ఛ వైపు పరివర్తన చెందడానికి ఎంతో మంది అద్భుతంగా కృషి చేశారు. ఆనాడు వాళ్లు జరిపిన పోరాటాలు, నెరపిన త్యాగాలలో నాటి తెలంగాణ ప్రజలందరూ భాగస్వాములే. ఆనాటి ఆ మహనీయుల త్యాగాలను మనం గుర్తు చేసుకోవాలి. అప్పటి ఉజ్వల ఉద్యమ సందర్భం తెలంగాణ కీర్తి కిరీటంలో శాశ్వతంగా కలికితురాయిగా నిలిచిపోయింది. నాటి అద్భుత ఘట్టాలు జాతి జనుల స్మృతిలో నిలిచిపోయాయి. ఆనాటి పోరాటాలకు కొంత మంది నాయకత్వం వహించడం.. ప్రపంచ పోరాటాలన్నింటిలో కనిపించేదే. ఆనాడు కొంత మంది పోరాడితే.. మరి కొంత మంది నాయకత్వం వహించారు. వారందరినీ మనం తలచుకోవడం మనందరి కర్తవ్యమని కేసీఆర్ అన్నారు.

ఆనాటి మహనీయులకు నా నమస్సులు..

అదిలాబాద్ అడవుల్లో జల్, జంగిల్, జమీన్ నినాదంతో సింహగర్జన చేసిన ఆదివాసీ యోధుడు కొమ‌రం భీం, భూస్వాముల ఆగడాలకు బలైన దొడ్డి కొమరయ్యను, తనకు ఉన్న వేలాది ఎకరాల భూములను పంచిపెట్టిన రావి నారాయణ రెడ్డిని, రామానంద తీర్థ, సర్ధార్ జమలాపురం కేశవరావు, వట్టికోట అల్వార్ స్వామి, చాకలి ఐలమ్మ, భీమిరెడ్డి నర్సింహారెడ్డి, నల్లా నర్సింహులు, బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, దేవులపల్లి వెంకటేశ్వర్లు, బద్దం ఎల్లారెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి, కాళోజీ నారాయణరావు, మగ్దూం, షోయబుల్లా ఖాన్, దాసరథి, సుద్దాల హన్మంతు వంటి మహానుభావులను గుర్తు చేసుకోవాల్సిన సందర్భమని.. వారికి నా శిరస్సు వంచి నమస్సులు తెలియజేస్తున్నానని కేసీఆర్ అన్నారు.

ఆనాడు మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సర్ధార్ వల్లభాయ్ పటేల్ వంటి మహానుభావుల వల్లే ఒక్కో చిక్కుముడి విడిపోయి దేశంలో అంతర్భాగం అయ్యామని కేసీఆర్ అన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండేది. ఆనాడే మిగులు నిధులతో అభివృద్ధి దిశగా అడుగులు వేసిందని కేసీఆర్ గుర్తుచేశారు. అయితే రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ పేరుతో హైదరాబాద్ రాష్ట్రాన్ని బలవంతంగా ఏపీలో కలిపారు. ఇక్కడి ప్రజల మనోభిష్టానికి వ్యతిరేకంగా తెలంగాణ, ఆంధ్రులను కలిపి ఆంధ్రప్రదేశ్‌గా మార్చారు. ఆనాటి నుంచే ఇరు ప్రజల మధ్య సఖ్యత లేకుండా పోయింది. అందుకే కొత్త రాష్ట్రం ఏర్పడిన దశాబ్ధానికే ఇక్కడి ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించారు. కానీ ఆనాటి జాతీయ నాయకులు ఇక్కడి ప్రజల అభిప్రాయాలను పట్టించుకోలేదని కేసీఆర్ అన్నారు. 58 ఏళ్ల పాటు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఎంతో నష్టపోయారు. ఆ తర్వాత తాను నేతృత్వం వహించిన తెలంగాణ ఉద్యమం సుదీర్ఘ పోరాటం తర్వాత ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించింది.

తెలంగాణ అగ్రగామిగా నిలిచింది..

కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా పురోగమిస్తుంది. ఇవ్వాళ దేశానికే దారి చూపే టార్చ్ బేరర్‌గా నిలిచింది. విద్యుత్, తాగు, సాగునీరు, వ్యవసాయం, ప్రజా సంక్షేమం, పారిశ్రామిక, ఐటీ రంగాల్లో అద్భుతాలు ఆవిష్కరించే రాష్ట్రంగా దేశానికి దిశానిర్దేశం చేస్తుందని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రగతి శీల, పారదర్శక విధానాల వల్ల రాష్ట్ర సంపద గణనీయంగా పెరిగిందని సీఎం తెలిపారు. 2013-14 తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్ర జీడీపీ రూ. 5,05,849 కోట్లు ఉండగా.. 2021-22 నాటికి రూ. 11,54,860 కోట్లకు పెరిగిందని కేసీఆర్ వెల్లడించారు. తలసరి ఆదాయంలో కూడా తెలంగాణ జాతీయ సగటును అధిగమించిందని చెప్పారు. 2014-15లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 1,24,104 కాగా.. 2021-22 నాటికి రూ. 2,78.833కు పెరిగిందని సీఎం చెప్పారు. రాష్ట్రంలో పెరిగిన సంపదను ప్రజలకు పంచాలనే లక్ష్యంతో ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేశామని అన్నారు. అనేక సంక్షేమ పథకాల కోసం ఏటా రూ. 50వేల కోట్లు వెచ్చిస్తున్నామని అన్నారు.

సెప్టెంబర్ 17ను కూడా వక్రీకరించారు..

మతం అనే చిచ్చు పెట్టి మానవ సంబంధాలను మంటగలుపుతున్నారని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మతం చిచ్చు ఇలాగే విజృంభిస్తే అది రాష్ట్రం, దేశం యొక్క జీవికనే కబళిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అది ప్రతీ జాతి జీవనాడిని కలుషితం చేస్తుందని కేసీఆర్ చెప్పారు. జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే సెప్టెంబర్ 17 సందర్భాన్ని సైతం వక్రీకరించి.. తమ సంకుచిత స్వార్థ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలని కొందరు భావిస్తున్నారు. అలాంటి నీచమైన ఎత్తుగడలతో విచ్ఛిన్నానికి పాల్పడుతున్నారు. ఆనాటి చరిత్రతో, పరిణామాలతో వీసమెత్తు సంబంధం లేని ఈ అవకాశవాదులు, ఆషాడభూతులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ఉజ్వలమైన తెలంగాణ చరిత్రను వక్రీకరించి మలినం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ సమాజం ఎంతో చైతన్యవంతమైంది. మేధో సంపత్తితో, క్రీయాశీలతతో చురుకుగా వ్యవహరించి స్వరాష్ట్రాన్ని సాధించుకుంది. ఇప్పుడు మరోసారి అదే బుద్ది కుశలత ప్రదర్శించి.. మన జాతి జీవనాడిని తెంచేయాలని చూస్తున్న ఈ దుష్ట శక్తుల కుటిల యత్నాలను తిప్పికొట్టాలని కేసీఆర్ అన్నారు. మనం రెప్పపాటు కాలం ఆదమరిచినా.. ఈ సమాజంలో కల్లోలం సృష్టించడానికి వాళ్లు సిద్ధంగా ఉన్నారని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. ఈ విషయాన్ని మీకు చెప్పడం నా కర్తవ్యమే కాదు.. గురుతర బాధ్యత అని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ నేల ఎన్నటికీ శాంతి, సౌభాగ్యాలతో విలసిల్లాలే తప్ప అశాంతి, అలజడులతో అట్టుడికి పోవద్దు. మనం ఎంత వేగంతో పురోగమిస్తున్నామో.. రాబోయే రోజుల్లో కూడా అంతే వేగంగా అభివృద్ధి పథంలోకి దూసుకెళ్లాలని కేసీఆర్ ఆకాంక్షించారు.

First Published:  17 Sep 2022 7:07 AM GMT
Next Story