Telugu Global
Telangana

జాతీయ గీతాలాపనకు అబిడ్స్ ఎందుకు వేదికైంది..?

అక్కడున్న భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ విగ్రహం మాత్రం మన వారసత్వాన్ని, స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని, మహనీయుల ఘన కీర్తిని కేసీఆర్ గుర్తించినందుకు, గుర్తుంచుకున్నందుకు.. ప్రసన్నవదనంతో కనిపించింది.

జాతీయ గీతాలాపనకు అబిడ్స్ ఎందుకు వేదికైంది..?
X

యావత్ తెలంగాణ అంతా ఈరోజు ఉదయం 11.30 నిముషాలకు ముక్త కంఠంతో జనగణమన పాడింది. ఇంట్లో ఉన్నవారు, రోడ్డుపై ఉన్నవారు, స్కూల్ లో ఉన్నవారు, ప్రయాణంలో ఉన్నవారు.. తెలంగాణ ప్రజానీకం అంతా 11.30 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపనతో రికార్డు సృష్టించారు. హైదరాబాద్ నగరంలోని అబిడ్స్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలతో కలసి పాల్గొన్నారు సీఎం కేసీఆర్. ప్రగతి భవన్ నుంచే ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొని తన సందేశం వినిపించొచ్చు. లేదా అసెంబ్లీని వేదికగా చేసుకుని ఉండొచ్చు, ఇంకేదయినా చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతాన్ని ఎంచుకొని ఉండొచ్చు. కానీ కేసీఆర్ తొలిసారిగా ఈ కార్యక్రమానికి అబిడ్స్ ని వేదికగా ఎందుకు ఎంపిక చేసుకున్నట్టు..? వైరి వర్గాలకు ఇది ఓ అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. కానీ అక్కడున్న భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ విగ్రహం మాత్రం మన వారసత్వాన్ని, స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని, మహనీయుల ఘన కీర్తిని కేసీఆర్ గుర్తించినందుకు, గుర్తుంచుకున్నందుకు.. ప్రసన్నవదనంతో కనిపించింది.

అవును.. అక్కడ నెహ్రూ విగ్రహం ఉంది. మామూలు రోజుల్లో ఎవరూ ఆ విగ్రహాన్ని పెద్దగా పట్టించుకోరు కానీ, స్వాతంత్ర వజ్రోత్సవాల వేళ, మన దేశ తొలి ప్రధానిని గుర్తుంచుకోవడం, గుర్తించడం అనివార్యం. దేశవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న స్వాతంత్ర వేడుకల్లో మహాత్ముడిని కూడా విస్మరించడం రివాజుగా మారింది. వీరసావర్కార్ లాంటి వారిని హైలెట్ చేసినంతగా గాంధీని గుర్తించట్లేదు భక్తులు. ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఈ విషయంలో కేంద్రంపై మండిపడ్డారు. గాంధీని తెరమరుగు చేసే ప్రయత్నం జరుగుతోందని, చరిత్రను మార్చే కుటిల యత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. గాంధీని సైతం గుర్తించనివారు నెహ్రూని గుర్తు పెట్టుకుంటారనుకోలేం. పైగా దేశ విభజన సమయంలో జరిగిన పరిణామాలంటూ నెహ్రూ కీర్తిని తగ్గించే ప్రయత్నం బీజేపీ చేసింది. దీనిపై కాంగ్రెస్ నిరసనలు వ్యక్తం చేసినా, బీజేపీ తప్పుడు ప్రచారాలముందు కాంగ్రెస్ గొంతుకలు పెద్దగా వినిపించలేదు.

బీజేపీ కుటిల నీతిని తిప్పికొట్టే ప్రయత్నమే అబిడ్స్ లోని నెహ్రూ విగ్రహం కేంద్రంగా తెలంగాణ వ్యాప్తంగా జరిగిన జాతీయ గీతాలాపన. స్వాతంత్ర పోరాటాన్ని తనకు అనుకూలంగా మార్చుకోడానికి బీజేపీ వేసిన ఎత్తుని చిత్తు చేసేదే ఈ ప్రయత్నం. అందుకే సామూహిక జాతీయ గీతాలాపనకు అబిడ్స్ సెంటర్ ని సీఎం కేసీఆర్ ఎంచుకున్నారని అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనిపై విపరీతమైన చర్చ జరుగుతోంది. నెహ్రూ పేరు చెబితే అభద్రతా భావానికి లోనయ్యే కొందరు, స్వాతంత్ర వజ్రోత్సవ వేళ.. నెహ్రూని మరుగున పరిచే ప్రయత్నాలు చేస్తున్నారని, వారికి చెంపపెట్టుగా తెలంగాణ సీఎం కేసీఆర్ సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని నెహ్రూ విగ్రహం వద్ద నిర్వహించారని అంటున్నారు.

First Published:  16 Aug 2022 8:30 AM GMT
Next Story