Telugu Global
Telangana

పరిగి సభలో కేసీఆర్ కీలక హామీ..

నూటికి నూరు శాతం అక్షరాస్యత ఉన్న రాష్ట్రంగా తెలంగాణ అవతరించాలని ఆకాంక్షించారు. తెలంగాణ మరింత ముందుకు వెళ్లాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్లీ రావాలన్నారు కేసీఆర్.

పరిగి సభలో కేసీఆర్ కీలక హామీ..
X

మూడోసారి అధికారంలోకి వచ్చాక మిషన్‌ మోడ్‌ లో పేదలకు ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్‌. పరిగి ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన.. రాష్ట్రం మరింత ముందుకు పోవాలంటే ఈసారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలన్నారు. తెలంగాణ ఇంకా చిక్కపడాలంటే తప్పకుండా మీ ఆశీస్సులు అవసరమవుతాయన్నారు. ఇప్పటి వరకు వ్యవసాయం, కరెంటు, మంచినీళ్లు, రోడ్లు బాగు చేసుకుంటూ వచ్చామని, పేదలకు ఇళ్లు కట్టాల్సి ఉందని, వచ్చే సంవత్సరంలో మిషన్‌ మోడ్‌ తీసుకొని ముమ్మరంగా ఇళ్లు కట్టిస్తామన్నారు. ఇళ్ల స్థలాలు లేనివారికి వాటిని కేటాయించి ఇల్లు కట్టించే ఏర్పాటు చేస్తామన్నారు. ఒకటేరోజు అన్నీ కావని, ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ పోతున్నామని అన్నారు కేసీఆర్.

కాంగ్రెస్‌ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, బీఆర్ఎస్ కంటే మంచిగా చేస్తామని చెప్పాలి కానీ, ధరణి తీస్తేస్తాం.. మళ్లీ వీఆర్వోలని తెస్తామని ఎవరైనా అంటారా అని ప్రశ్నించారు కేసీఆర్. కాంగ్రెస్‌ వస్తే తప్పకుండా దళారీ రాజ్యం వస్తుందని, పైరవీకారులు చెలరేగుతారని, మునిగిపోతాం జాగ్రత్తగా ఉండండి అని రైతులకు సూచించారు. ఓటు ఆషామాషీగా వేయొద్దన్నారు.


పరిగి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 52 తండాలను గ్రామ పంచాయతీలు చేయించామన్నారు కేసీఆర్. తండాల్లో లంబాడా బిడ్డలే రాజ్యమేలుతున్నారని చెప్పారు. ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచుకున్నామని.. విద్య, ఉద్యోగ అవకాశాలు పెరిగాయని చెప్పారు. కాంగ్రెస్‌ నేతలు, ప్రజల్ని ఓటు బ్యాంకుగా వాడుకున్నారు తప్ప ఎన్నడూ ఏమీ చేయలేదని విమర్శించారు. దళితబిడ్డలను అభివృద్ధి చేయాలని దళితబంధు తీసుకువచ్చామని చెప్పారు కేసీఆర్. దళితబంధు ప్రతి పేద దళిత బిడ్డకు అందే వరకు బీఆర్ఎస్ ఆ పథకాన్ని కొనసాగిస్తుందన్నారు. సమాజంలోని ప్రతి ఒక్క వర్గాన్ని, కులాన్ని అందరినీ వెంట తీసుకొనిపోతామని హామీ ఇచ్చారు. కులం, మతం లేకుండా అందరిని కలుపుకొని పోతున్న పార్టీ బీఆర్‌ఎస్‌ అని చెప్పారు కేసీఆర్. కొప్పుల మహేష్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.

తానేదో పదవి కోసం కొట్లాడుతున్నానని కాంగ్రెస్‌ నేతలు అనుకుంటున్నారని, కానీ తెలంగాణ అభివృద్ధే తన ధ్యేయమని చెప్పారు కేసీఆర్. కచ్చితంగా పేదరిక నిర్మూలన జరగాలని, నూటికి నూరు శాతం అక్షరాస్యత ఉన్న రాష్ట్రంగా తెలంగాణ అవతరించాలని ఆకాంక్షించారు. తెలంగాణ మరింత ముందుకు వెళ్లాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్లీ రావాలన్నారు కేసీఆర్.

First Published:  22 Nov 2023 1:51 PM GMT
Next Story