Telugu Global
Telangana

బీఆర్ఎస్ మీ ఇంటి పార్టీ..

పదేళ్లలో పాల‌కుర్తిలో ఎంతో మార్పు వ‌చ్చిందన్నారు సీఎం కేసీఆర్. గతంలో పాల‌కుర్తి నుంచి వేలాది మంది వ‌ల‌స పోయారని, ఇప్పుడు వేరే రాష్ట్రం నుంచి వ‌చ్చి వ‌రినాట్లు వేస్తున్నారని చెప్పారు.

బీఆర్ఎస్ మీ ఇంటి పార్టీ..
X

అభ్య‌ర్థుల గురించి మాత్ర‌మే కాదు.. వారి వెనుకున్న పార్టీల గురించి ఆలోచించాలని సూచించారు సీఎం కేసీఆర్. పాలకుర్తిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన.. స్థానిక అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి భారీ మెజార్టీ రావాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్, బీజేపీకి అధికారం ఇస్తే ఏం చేశారు..? ఏం చేస్తారు..? అనేది ఆలోచించాలన్నారు. బీఆర్ఎస్ మీ కళ్ల ముందు పుట్టిన పార్టీ అని, తెలంగాణ హ‌క్కులు, ప్ర‌జ‌ల‌ను కాపాడ‌టం కోసం పుట్టిందని వివరించారు. కాంగ్రెస్, బీజేపీ చ‌రిత్ర అందరికీ తెలుసని, పదేళ్లపాటు బీఆర్ఎస్ ఏం చేసిందో కూడా అందరికీ తెలుసని.. పాలన బేరీజు వేసుకుని ఓట్లు వేయాలని సూచించారు కేసీఆర్.


పదేళ్లలో పాల‌కుర్తిలో ఎంతో మార్పు వ‌చ్చిందన్నారు సీఎం కేసీఆర్. గతంలో పాల‌కుర్తి నుంచి వేలాది మంది వ‌ల‌స పోయారని, ఇప్పుడు వేరే రాష్ట్రం నుంచి వ‌చ్చి వ‌రినాట్లు వేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో ఇలా ఎందుకు జరగలేదన్నారు. ఉద్య‌మ స‌మ‌యంలో చాలాసార్లు పాల‌కుర్తికి వ‌చ్చానని, నాడు ఎస్సారెస్సీ కాల్వ‌ల్లో గ‌డ్డి చెట్లు మొలిచి కూలిపోయి ఉండేదని చెప్పారు కేసీఆర్. నీళ్లు వ‌స్తాయ‌నే ఆశ కూడా ఎవరిలో ఉండేది కాదని, దేవాదుల పూర్తి చేసి కాళేశ్వ‌రం క‌ట్టి నీళ్లు తీసుకొచ్చామని, ల‌క్షా 30 వేల ఎక‌రాల‌కు నీళ్లు పారుతున్నాయని చెప్పారు. పాలకుర్తి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారని చెప్పారు కేసీఆర్.

నాలుగు డ‌బ్బులు, రెండు సీసాలు ఇచ్చారని ప్ర‌లోభాల‌కు గురై ఓటు వేయొద్దని హితవు పలికారు సీఎం కేసీఆర్. గ్రామాల్లో, ప‌ట్ట‌ణాల్లో కూర్చుని చ‌ర్చించి ఓట్లు వేసిన‌ప్పుడే ప్ర‌జ‌లు గెలుస్తారన్నారు. అప్పుడే నిజ‌మైన ప్ర‌జాస్వామ్యం వ‌చ్చిన‌ట్లు అని పేర్కొన్నారు. ఎల‌క్ష‌న్లు అన‌గానే సీటీలు, డ‌ప్పులు, అబ‌ద్దాలు, అభాండాలు, ఆరోప‌ణ‌లు, గోల్ మాల్, పిచ్చి పిచ్చి కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయని చెప్పారు కేసీఆర్. అభ్య‌ర్థుల గుణ‌గ‌ణాలు చూసి ఓట్లు వేయాలన్నారు. ఇక్క‌డ గెలిచే అభ్య‌ర్థితోనే రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్ప‌డుతుందని, ఆ ప్ర‌భుత్వం మంచిదైతే ఐదేళ్లపాటు ప్రజలకు మంచి జరుగుతుందని, లేకపోతే ఆగమైపోతామని చెప్పారు. మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం కోసం మంచి ఎమ్మెల్యేని ఎన్నుకోవాలని సూచించారు కేసీఆర్.

First Published:  14 Nov 2023 9:16 AM GMT
Next Story