Telugu Global
Telangana

కేసు ఎత్తివేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశం

తాడ్వాయి కేసుపై తీవ్ర వ్యతిరేకత ఎదుర‌వ్వ‌డంతో రాష్ట్రప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రొఫెసర్‌ హరగోపాల్‌ సహా మిగతావారిపై మోపిన కేసును ఎత్తివేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోలీసులను ఆదేశించారు.

కేసు ఎత్తివేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశం
X

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాడ్వాయి పోలీస్‌ స్టేషన్‌లో పౌరహక్కుల నేత ప్రొఫెసర్‌ హరగోపాల్‌ సహా, 152 మంది ప్రజా సంఘాల కార్యకర్తలపై నమోదైన కేసును ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాడ్వాయి కేసును ఎత్తివేయాలని సీఎం కేసీఆర్ రాష్ట్ర డీజీపీ అంజన్‌ కుమార్‌ను ఆదేశించారు.

2022 ఆగస్టు 19న ములుగు జిల్లా తాడ్వాయి స్టేషన్‌లో ప్రొఫెసర్‌ హరగోపాల్‌, ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌, ప్రొఫెసర్‌ పద్మజాషా, అరుణోదయ విమలక్క‌, పీఓడబ్ల్యూ సంధ్య సహా 152 మందిపై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయం దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది.

మావోయిస్టులతో కలిసి హక్కుల నేతలు, ప్రజా సంఘాల కార్యకర్తలు ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నారనే ఆరోపణతో UAPA కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల తీరును ప్రతిపక్ష పార్టీలు, హక్కుల సంఘాలు తప్పుబట్టాయి. వామపక్ష పార్టీలతో పాటు, కాంగ్రెస్‌ పార్టీ సైతం కేసును ఎత్తివేయాలని డిమాండ్‌ చేశాయి.

మావోయిస్టు పార్టీతో ప్రజా సంఘాలకు ఎలాంటి సంబంధం లేదని పలువురు ప్రజాస్వామిక వాదులు వాదించారు. ఇది పూర్తిగా తప్పుడు కేసని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి కేసులు సరికాదని వాదించారు. ప్రొఫెసర్‌ హరగోపాల్‌ లాంటి వాళ్లు దశాబ్దాలుగా హక్కుల ఉద్యమంలో పనిచేస్తున్నారని, అలాంటి వారిపై కేసులు మోపడం సరైంది కాదని వామ‌పక్ష పార్టీలు అన్నాయి.

తాడ్వాయి కేసుపై తీవ్ర వ్యతిరేకత ఎదుర‌వ్వ‌డంతో రాష్ట్రప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రొఫెసర్‌ హరగోపాల్‌ సహా మిగతావారిపై మోపిన కేసును ఎత్తివేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోలీసులను ఆదేశించారు.

First Published:  17 Jun 2023 7:23 AM GMT
Next Story