Telugu Global
Telangana

మీరే నా బలం, మీరే నా బలగం – కేసీఆర్ ఆత్మీయ సందేశం..

బీఆర్ఎస్ 60 లక్షల సభ్యత్వాలతో అజేయంగా నిలిచిందన్నారు. ఒక్కొక్కరు ఒక్కో కేసీఆర్ లాగా పల్లెల్లో, గల్లీల్లో గులాబీ జెండా రెపరెపలాడించారన్నారు.

మీరే నా బలం, మీరే నా బలగం – కేసీఆర్ ఆత్మీయ సందేశం..
X

బీఆర్ఎస్ శ్రేణులకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం పేరిట రెండు పేజీల లేఖ విడుదల చేశారు. భారత్ రాష్ట్ర సమితి ప్రయాణంలో మీరే నా బలం, మీరే నా బలగం అని చెప్పారాయన. ఎన్నికల ఏడాది.. నిరంతరం ప్రజల్లో ఉండాలని, పనికిమాలిన పార్టీల దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని సందేశమిచ్చారు. దేశం కోసం జరిగే పోరాటాలన్నింటిలో ధర్మమే జయిస్తుందని చెప్పారాయన.

ఒక్కొక్కరూ ఒక్కో కేసీఆర్ లాగా..

భారత్ రాష్ట్ర సమితి కుటుంబ సభ్యులకు నమస్తే.. అంటూ లేఖ రాశారు కేసీఆర్. 14 ఏళ్లపాటు పేగులు తెగేదాకా కొట్లాడి తెలంగాణ సాధించుకున్నామని, ఉద్యమ కాలంలో జెండా భుజాన వేసుకుని, లాఠీలకు, జైళ్లకు వెరవకుండా రేయింబవళ్లు శ్రమించి పార్టీని కాపాడుకున్న ఘన కీర్తి గులాబీ సైనికులకే దక్కుతుందని చెప్పారు. ఉద్యమ వీరులుగా ఆనాడు, నవతెలంగాణ నిర్మాణ యోధులుగా ఈనాడు పట్టుదల, అంకిత భావంతో కార్యకర్తలు పని చేస్తున్నారని కితాబిచ్చారు. బీఆర్ఎస్ 60 లక్షల సభ్యత్వాలతో అజేయంగా నిలిచిందన్నారు. ఒక్కొక్కరు ఒక్కో కేసీఆర్ లాగా పల్లెల్లో, గల్లీల్లో గులాబీ జెండా రెపరెపలాడించారన్నారు.


ఆగమైపోయిన తెలంగాణ నేడు కుదుటపడ్డదని, దాన్ని కాపాడుకునే బాధ్యత, బీఆర్ఎస్ నేతృత్వంలో మరింత అభివృద్ధి చేసుకునే బాధ్యత పార్టీ శ్రేణులపైనే ఉందన్నారు కేసీఆర్. తెలంగాణను దేశానికి నమూనాగా నిలబెట్టామని చెప్పారు. ఏ వర్గాన్నీ చిన్నబుచ్చకుండా, ఏ ఒక్కరినీ విస్మరించకుండా, కుల, మత భేద భావాలు లేకుండా పాలన సాగించామని అన్నారు. మరోవైపు కేంద్రంలోని ప్రభుత్వాలు దేశాన్ని సర్వనాశనం చేశాయని, 75 ఏళ్ల స్వాతంత్రంలో కూడా దేశం వెనకబడే ఉందని చెప్పారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో బీఆర్ఎస్ ముందుకెళ్తుంటే కేంద్రంలోని బీజేపీ బరితెగింపు దాడులకు తెగబడుతోందన్నారు కేసీఆర్.

తెలంగాణ సమాజం, బీఆర్ఎస్ పార్టీనే ఎప్పుడూ ఆదరిస్తుందని, చిల్లర మల్లర రాజకీయ శక్తులను ఆదరించదని విశ్వాసం వ్యక్తం చేశారు కేసీఆర్. తెలంగాణతో బీఆర్ఎస్ పార్టీది పేగుబంధం అని చెప్పారు. పురిటిగడ్డపై మరోసారి బీఆర్ఎస్ బ్రహ్మాండమైన విజయం సాధించడం తథ్యం అన్నారు. భారత రాష్ట్ర సమితిని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

First Published:  20 March 2023 1:39 PM GMT
Next Story