Telugu Global
Telangana

ఎమ్మెల్యేల ఎర కేసులో సీఎం కేసీఆర్ జోక్యం లేదు.. సుప్రీంకోర్టుకు స్పష్టం చేసిన న్యాయవాది దవే

ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడానికి జరిగిన కుట్రను చెప్పడమే సీఎం కేసీఆర్ ఉద్దేశమని.. అంతే కానీ దర్యాప్తులో జోక్యం చేసుకోవడం కాదని దవే చెప్పారు.

ఎమ్మెల్యేల ఎర కేసులో సీఎం కేసీఆర్ జోక్యం లేదు.. సుప్రీంకోర్టుకు స్పష్టం చేసిన న్యాయవాది దవే
X

బీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీకి చెందిన ఏజెంట్లు కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన కేసులో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకోలేదని సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే అన్నారు. విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి.. వాటి వివరాలు తెలియజేయడం దర్యాప్తులో జోక్యం చేసుకోవడం కిందకు రాదని ఆయన చెప్పారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ధర్మాసనానికి ఆయన తన వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేల ఎర కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ క్రిమినల్ అప్పీల్‌పై సోమవారం సుప్రీంకోర్టులో జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అరవిందకుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నం కేసులోని ఆధారాలను సీఎం ఎలా ఇతరులకు పంపుతారు? ఇలా చేయడం అంటే దర్యాప్తులో జోక్యం చేసుకోవడమే కదా.. అని ధర్మాసనం ప్రశ్నించింది. కాగా, ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడానికి జరిగిన కుట్రను చెప్పడమే సీఎం కేసీఆర్ ఉద్దేశమని.. అంతే కానీ దర్యాప్తులో జోక్యం చేసుకోవడం కాదని దవే చెప్పారు. ఈ ఒక్క విషయాన్ని ఆధారంగా తీసుకొని కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించడం తీవ్రమైన విషయంగా పరిగణించాలని దుష్యంత్ దవే కోరారు.

సీబీఐ దర్యాప్తు చేస్తున్న కేసుల వివరాలు కూడా బయటకు పొక్కుతున్నాయని.. వాటిపై నిత్యం టీవీల్లో వార్తలు ప్రసారమవుతున్నాయని ధర్మాసనానికి దవే చెప్పారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కేసును సీబీఐ విచారిస్తోందని.. దీనికి సంబంధించిన వివరాలు నిత్యం టీవీలు, పత్రికల్లో వస్తున్న విషయాన్ని ధర్మాసనానికి తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక పార్టీకి చెందిన ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూసిన జాతీయ పార్టీపై పోరాటంగానే దీన్ని చూడాలని దవే కోరారు.

ఎమ్మెల్యేల ఎర కేసును దర్యాప్తు చేసిన సిట్ వద్ద దానికి సంబంధించిన వీడియో, ఆడియో, వాట్సప్ చాట్ వంటి కీలక ఆధారాలు ఉన్నాయని ధర్మాసనానికి తెలియజేశారు. నిందితులు కోరుకున్నట్లుగా దర్యాప్తు ఎంపిక జరగరాదని ఆయన న్యాయస్థానానికి విన్నవించారు. సీబీఐ దర్యాప్తు చేయడం అంటే నిందితులు కోరుకున్నట్లు జరగడమే అని అన్నారు. దేశంలో బీజేపీ, దాని మిత్ర పక్షాలకు చెందిన నేతలపై 35 కేసులు నమోదయ్యాయని చెప్పారు. వీటి దర్యాప్తు ఏ మాత్రం ముందుకు పోవడం లేదని తెలిపారు. అదే ప్రతిపక్ష నేతల కేసులైతే వేగంగా విచారిస్తూ.. జైళ్లలో పెడుతున్నారని కోర్టుకు దవే చెప్పారు.

ఈ కేసులో బీజేపీ క్లీన్ చిట్ మాత్రమే కోరిందని.. ఆ తర్వాత స్టే అడిగిందన్న విషయాన్ని దవే గుర్తు చేశారు. అయినా సరే నిందితులు కోరుకున్నట్లు సీబీఐ దర్యాప్తుకు ఆదేశాలు ఇవ్వడం సరికాదన్నారు. కాగా, ఈ కేసులో తదుపరి విచారణను హోలీ సెలవుల తర్వాత మార్చి 13న కొనసాగిస్తామని ధర్మసనం తెలిపింది. బీజేపీ తరపున సీనియర్ లాయర్ మహేశ్ జఠ్మలాని విచారణకు హాజరయ్యారు. దవే దాదాపు గంట సేపు తన వాదనలు వినిపించారు.

First Published:  28 Feb 2023 3:32 AM GMT
Next Story