Telugu Global
Telangana

పేదల వద్దకే అత్యాధునిక వైద్యాన్ని తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే : మంత్రి కేటీఆర్

తెలంగాణ ప్రభుత్వం 'కంటి వెలుగు' కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని.. గురువారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందికి ఉచితంగా ఐ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించినట్లు మంత్రి వెల్లడించారు.

పేదల వద్దకే అత్యాధునిక వైద్యాన్ని తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే : మంత్రి కేటీఆర్
X

తెలంగాణలో వైద్య, ఆరోగ్య రంగానికి సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. పల్లె, బస్తీ దవాఖానలతో పేదల వద్దకే అత్యాధునిక వైద్య సేవలను తీసుకొని వచ్చిన ఘనత కేసీఆర్‌దే అని మంత్రి చెప్పారు. హైదరాబాద్‌లోని నార్సింగిలో కొత్తగా ఏర్పాటు చేసిన 255 పడకల శంకర కంటి ఆసుపత్రిని మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోవిడ్ సమయంలో చుట్టుపక్కల ఉన్న ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి ఎంతో మంది పేషెంట్లు హైదరాబాద్‌లో దొరుకుతున్న మెరుగైన వైద్య సేవల కోసం వచ్చారని గుర్తుచేశారు.

తెలంగాణ ప్రభుత్వం 'కంటి వెలుగు' కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని.. గురువారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందికి ఉచితంగా ఐ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించినట్లు మంత్రి వెల్లడించారు. కేవలం స్క్రీనింగ్ టెస్టులకే పరిమితం కాకుండా.. ఉచితంగా రీడింగ్, ప్రిస్క్రైబ్డ్ స్పెడ్స్‌ పంపిణీ చేశామని చెప్పారు. ఈ కంటి అద్దాలన్నీ తెలంగాణలోనే తయారయ్యాయని మంత్రి వెల్లడించారు. కంటి వెలుగు పథకం సీఎం కేసీఆర్ మానస పుత్రిక అని వివరించారు. ఐదేళ్ల క్రితమే ఈ కార్యక్రమం మొదటి విడత నిర్వహించినప్పుడు.. తెలంగాణ జనాభాలోని 75 శాతం మందికి స్క్రీనింగ్ టెస్టులు చేశామని అన్నారు. హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని బేస్‌గా తీసుకొని శంకర ఐ ఫౌండేషన్ కూడా కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రభుత్వంతో కలిసి నిర్వహించాలని సూచించారు.

కేసీఆర్ ఆరోగ్య రంగాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వల్లే నేడు రాష్ట్రంలో ఎన్నో కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభించుకోగలుగుతున్నామని కేటీఆర్ అన్నారు. రాష్ట్రం సాకారం కాక మునుపు కేవలం ఐదు మెడికల్ కాలేజీలు మాత్రమే తెలంగాణ ప్రాంతంలో ఉండేవి. అందుకే రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో ఒక మెడికల్, నర్సింగ్ కాలేజీ ఉండాలని కేసీఆర్ సంకల్పించారు. దాని ఫలితంగా ఇవ్వాళ ఎన్నో ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించుకుంటున్నామని చెప్పారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా జిల్లాకో మెడికల్ కాలేజీ లేదని.. కానీ, తెలంగాణ ఈ ఘనతను అందుకోవడానికి సీఎం కేసీఆర్ కారణమని మంత్రి కేటీఆర్ చెప్పారు.

ఆరోగ్య రంగంలో తెలంగాణ చేస్తున్న కృషిని కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించిందన్నారు. నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్‌లో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింద‌ని చెప్పారు. తమిళనాడు, కేరళ తర్వాత దేశంలో తెలంగాణనే ఆరోగ్య రంగంలో మంచి పురోగతిని కనపరిచిందన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఇంత అభివృద్ధి సాధించడం ఇతర రాష్ట్రాలకు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. ఇదే స్పూర్తిని కొనసాగిస్తే తెలంగాణ రాష్ట్రం రాబోయే రోజుల్లో తమిళనాడు, కేరళను కూడా దాటేస్తుందని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

శంకర ఐ ఫౌండేషన్ చేస్తున్న సేవలు అభినందనీయం..

శంకర ఐ ఫౌండేషన్ తరపున చేస్తున్న సేవలు అభినందనీయమని మంత్రి కేటీఆర్ అన్నారు. ఏడాదికి 30 వేల ఉచిత కంటి సర్జరీలు చేస్తుండటం తనను ఆశ్చర్యపరిచిందని చెప్పారు. అలాగే రోగుల కోసం ఉచితంగా రవాణా సౌకర్యాన్ని కల్పించడం కూడా బాగుందని చెప్పారు. గ్రామల నుంచి రోగులను తీసుకొని వచ్చి ఉచితంగా సర్జరీలు చేసి.. తిరిగి వారిని క్షేమంగా ఇంటి దగ్గరకు తీసుకెళ్లడం సంతోషాన్ని ఇచ్చిందని కేటీఆర్ అన్నారు. శంకర ఫౌండేషన్ ఒక ఆప్థోమెట్రీ కాలేజీని కూడా ప్రారంభిస్తే బాగుంటుందని కేటీఆర్ సూచించారు. విజన్ టెక్నీషియన్స్ ట్రైనింగ్ కోసం ఒక ఫౌండేషన్ స్థాపించడం వల్ల నగరంలోని ఎంతో మందికి ఉపయోగపడుతుందని అన్నారు.

శంకర ఫౌండేషన్ చేస్తున్న సేవలకు గాను.. ప్రభుత్వంతో మాట్లాడి వారి వాహనాల లైఫ్ ట్యాక్స్‌, ట్రాన్స్‌పోర్టేషన్ ట్యాక్స్‌ను రద్దు చేయిస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో శంకర ఐ హాస్పిటల్ తెలంగాణకు ఒక అద్భుతమైన వరంగా మారుతుందని అభివర్ణించారు.

Next Story