Telugu Global
Telangana

కొత్త సెక్రటేరియట్‌ను పరిశీలించిన సీఎం కేసీఆర్.. త్వరలోనే ప్రారంభమన్న కేటీఆర్

ప్రస్తుతం మూడు షిఫ్టుల్లో ఇంటీరియర్ పనులు జరుగుతున్నట్లు అధికారులు సీఎం కేసీఆర్‌కు చెప్పారు.

కొత్త సెక్రటేరియట్‌ను పరిశీలించిన సీఎం కేసీఆర్.. త్వరలోనే ప్రారంభమన్న కేటీఆర్
X

హైదరాబాద్ నడిబొడ్డున కొత్తగా నిర్మిస్తున్న సచివాలయం భవన నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ గురువారం పరిశీలించారు.ప్రతీ ఫ్లోర్‌ను కలియ తిరుగుతూ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి, అధికారులను ఆదేశించారు. ఇంటీరియర్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం మూడు షిఫ్టుల్లో ఇంటీరియర్ పనులు జరుగుతున్నట్లు అధికారులు సీఎం కేసీఆర్‌కు చెప్పారు.

అంతకు ముందు ప్రగతిభవన్‌లో ఆర్ అండ్ బీ శాఖలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పాడైన రోడ్లకు మ‌ర‌మ్మత్తులు, బాధ్యత‌ల వికేంద్రీక‌ర‌ణ‌పై ప్రధానంగా చ‌ర్చించారు. రోడ్డు ప‌నుల్లో నాణ్యత పెంచాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఆర్ అండ్ బీ శాఖ‌లో నియామ‌కాలు, కార్యాచ‌ర‌ణ‌పై కూడా చ‌ర్చించి దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షలో ఆ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

త్వరలో ప్రారంభం : కేటీఆర్

తెలంగాణ కొత్త సెక్రటేరియట్ త్వరలో ప్రారంభం కానున్నట్లు మున్సిపల్ మంత్రి కేటీఆర్ తెలిపారు. మరి కొద్ది నెలల్లోనే ఈ ఐకానిక్ భవనాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన ట్విట్టర్‌లో వెల్లడించారు. ఈ భవనానికి ఇప్పటికే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అందంగా రూపుదిద్దుకుంటున్న ఈ భవనం ప్రారంభానికి సిద్ధపడుతోందని ఆయన అన్నారు.

కాగా, తెలంగాణ ప్రభుత్వం ఈ భవన నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. 150-200 ఏళ్ల వరకు చెక్కు చెదరకుండా పటిష్టంగా నిర్మిస్తున్నారు. రూ. 617 కోట్లతో గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్‌తో ఈ భవనం రూపుదిద్దుకుంటోంది. దీని వల్ల గాలి, వెలుతురు సహజంగా లోపలికి వస్తాయి. దీంతో కరెంటు వాడకం కూడా గణనీయంగా తగ్గిపోతుంది. చాంబర్ల నిర్మాణం, ఇంటీరియర్ డిజైన్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, వర్క్ స్టేషన్ల ఏర్పాటు, కలరింగ్, ఫ్లోరింగ్, మార్బుల్స్, పోర్టికోల నిర్మాణం వంటి పనులన్నీ వేగంగా జరుగుతున్నాయి.

First Published:  17 Nov 2022 12:21 PM GMT
Next Story