Telugu Global
Telangana

మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం కేసీఆర్

మేధా కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించిన అనంతరం.. సీఎం కేసీఆర్ కర్మాగారంలోని మొత్తం మెషినరీని పరిశీలించారు.

మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం కేసీఆర్
X

మేధా గ్రూప్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కొండకల్ వద్ద నిర్మించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ కోచ్ ఫ్యాక్టరీగా రికార్డు సృష్టించిన ఈ ఫెసిలిటీని రూ.1,000 కోట్లతో నిర్మించారు. ఈ ఫ్యాక్టరీ ప్రారంభం కావడం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,200 మందికి ఉపాధి లభించనున్నది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కొల్లూరులో డబుల్ బెడ్రూం డిగ్నిటీ కమ్యూనిటీ హౌసింగ్ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన అనంతరం.. కేసీఆర్ మేధా కోచ్ ఫ్యాక్టరీని ఓపెన్ చేశారు.

మేధా కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించిన అనంతరం.. సీఎం కేసీఆర్ కర్మాగారంలోని మొత్తం మెషినరీని పరిశీలించారు. అక్కడ రైల్ కోచ్‌లను ఎలా తయారు చేస్తారో పూర్తి వివరాలు అక్కడి యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు. మన దేశంలోనే, మన ఇంజనీర్లతో రైల్ కోచ్‌లను నిర్మించాలనే లక్ష్యంతో మేధా కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించినట్లు నిర్వాహకులు చెప్పారు.

ఇండియాలోనే కాకుండా మరో ఐదు దేశాల్లో మేధా సంస్థకు ఫ్యాక్టరీలు ఉన్నట్లు కంపెనీ యాజమాన్యం వివరించింది. తెలంగాణలో కంపెనీని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. మేధా గ్రూప్ కేవలం కోచ్ తయారీనే కాకుండా.. రైల్వేలకు సంబంధించి సిగ్నలింగ్, ఇతర వ్యవస్థలను కూడా తయారు చేస్తున్నట్లు యాజమాన్యం చెప్పింది. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, మల్లారెడ్డి, సబిత ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

First Published:  22 Jun 2023 7:59 AM GMT
Next Story