Telugu Global
Telangana

వనరులున్నా.. వంచింపబడుతున్నాం - కేసీఆర్

2014కు ముందు 2800 మెడిక‌ల్ సీట్లు ఉంటే, ఇప్పుడవి 6500కు చేరుకున్నాయని చెప్పారు కేసీఆర్. అన్ని మెడిక‌ల్ కాలేజీలు ప్రారంభమైతే, 10 వేల సీట్లు అందుబాటులోకి వస్తాయన్నారు.

వనరులున్నా.. వంచింపబడుతున్నాం - కేసీఆర్
X

అన్ని ర‌కాల వ‌స‌తులు, వ‌న‌రులు ఉన్నా కూడా మన దేశం వంచించ‌బ‌డుతోందని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. అవ‌కాశాలు కోల్పోతుంద‌ని అన్నారు. అమెరికాలో వ్య‌వ‌సాయ అనుకూల భూమి లేనే లేదని, చైనాలో కేవలం 16 శాతం మాత్ర‌మే వ్య‌వ‌సాయ యోగ్యమైన భూమి ఉందని, మ‌న దేశంలో 50 శాతం భూమి వ్య‌వసాయానికి అనుకూలంగా ఉందని వివరించారు కేసీఆర్. వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు కూడా అనుకూలిస్తాయని, అన్ని ర‌కాల నేల‌లు కూడా ఉన్నాయని, 70 వేల టీఎంసీల నీళ్లు ఉన్నాయని.. ఇన్ని వ‌న‌రులు, వ‌స‌తులు ఉన్నా కూడా దేశం వంచింపబడుతోందని చెప్పారు. వరంగల్ లో ప్రతిమ మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన మెడికల్ విద్యార్థులు భావితరాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. మెడిసిన్ తో పాటు, సామాజిక విద్య కూడా నేర్వాలని సూచించారు.

కేంద్ర మంత్రులు వచ్చి తెలంగాణను తిట్టిపోతారని, మరుసటి రోజే ఇక్కడి ప్ర‌భుత్వ ప‌థ‌కాలు బాగున్నాయ‌ని వారే అవార్డులు ప్రకటిస్తారని.. ఇదేం మతలబు అని అన్నారు కేసీఆర్. ఉద్య‌మ స‌మ‌యంలో చెప్పిన‌వ‌న్నీ ఈరోజు సాకారం చేసుకున్నామని, తెలంగాణ జీఎస్డీపీ ఎక్కువ‌గా ఉందని, ప‌రిశుభ్ర‌త‌, ప‌చ్చ‌ద‌నంతో పాటు అనేక రంగాల్లో తెలంగాణ ముందంజ‌లో ఉందని వివరించారు. తెలంగాణ ప్ర‌జ‌ల్లో అద్భుత‌మైన చైత‌న్యం ఉందని చెప్పారు. అన్ని వ‌ర్గాల‌ ఆకాంక్ష‌ల మేర‌కు తమ ప్రభుత్వం ప‌ని చేస్తోందని పేర్కొన్నారు.

ఏమ‌రుపాటుతో ఉంటే దెబ్బ తింటామని, సమాజంతోపాటు మనం కూడా పురోగతి సాధించాలన్నారు కేసీఆర్. ఆనాటి నాయ‌క‌త్వ త‌ప్పిదం వ‌ల్ల రాష్ట్రాన్ని సాధించుకునేందుకు ద‌శాబ్దాల కాలం ప‌ట్టిందని గుర్తు చేశారాయన. మేధావులు చైత‌న్య‌వంతం చేసిన సమాజం ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. మెడికల్ రంగంలో కృషి చేస్తూనే న‌వ స‌మాజ నిర్మాణానికి, న‌వ భార‌త నిర్మాణానికి మెడికల్ స్టూడెంట్స్ అందరూ అడుగులు ముందుకు వేయాల‌న్నారు కేసీఆర్.

ఇవీ మన విజయాలు..

ఆరోగ్యం రంగంలో తెలంగాణ అద్భుతాలు సాధించిందని, 2014కు ముందు తెలంగాణ ప్రాంతంలో ఐదు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయని, కొత్త‌గా 33 జిల్లాల్లోనూ కాలేజీలు వస్తున్నాయని చెప్పారు. మెడిక‌ల్ కాలేజీల మంజూరు విష‌యంలో కేంద్రం వివ‌క్ష చూపించిందని అన్నారు. 2014కు ముందు 2800 మెడిక‌ల్ సీట్లు ఉంటే, ఇప్పుడవి 6500కు చేరుకున్నాయని చెప్పారు. అన్ని మెడిక‌ల్ కాలేజీలు ప్రారంభమైతే, 10 వేల సీట్లు అందుబాటులోకి వస్తాయన్నారు.

హెల్త్ ప్రొఫైల్..

తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ త‌యారు చేస్తున్నామని, ప్ర‌యోగాత్మ‌కంగా.. సిరిసిల్ల‌, ములుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో 100 శాతం హెల్త్ ప్రొఫైల్‌ ను త‌యారు చేశామని చెప్పారు కేసీఆర్. ఈ హెల్త్ ప్రొఫైల్ ద్వారా ఎవరికి ఏ వ్యాధి వచ్చినా, ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా.. ఒక్క నిమిషంలోనే పాత విషయాలన్నీ ఫైల్ రూపంలో బటకొస్తాయని చెప్పారు. 119 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ కార్య‌క్ర‌మం పూర్త‌యితే నిమిషంలోనే ప్ర‌తి ఒక్క‌రి ఆరోగ్య‌ చ‌రిత్ర తెలుస్తుందన్నారు. క్ష‌ణాల్లో మెరుగైన వైద్యం అందుతుంద‌ని చెప్పారు. హెల్త్ యూనివ‌ర్సిటీ కూడా వ‌రంగ‌ల్‌ లోనే నెల‌కొల్పామ‌ని, 2వేల పడకలతో సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రి నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ మెడిక‌ల్ సిటీ హైద‌రాబాద్‌ ను మించి పోతుంద‌ని, ఆ తర్వాత హైద‌రాబాద్ వారే వ‌రంగ‌ల్‌ కు వైద్యం కోసం వ‌చ్చే ప‌రిస్థితి ఏర్ప‌డుతుంద‌ని చెప్పారు కేసీఆర్.

First Published:  1 Oct 2022 9:59 AM GMT
Next Story