Telugu Global
Telangana

దేశాన్ని కులం, మతం పేరిట విచ్ఛిన్నం చేస్తున్నారు : సీఎం కేసీఆర్

75 ఏళ్లుగా దేశాన్ని నిర్మించుకుంటూ వస్తున్నాము. కానీ, ఒక పార్టీ మాత్రం నీచమైన రాజకీయాలతో దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకొని పోతుందని కేసీఆర్ చెప్పారు.

దేశాన్ని కులం, మతం పేరిట విచ్ఛిన్నం చేస్తున్నారు : సీఎం కేసీఆర్
X

దేశాన్ని కాపాడుకోవల్సిన బాధ్య‌త‌ మనపైనే ఉంది

తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది

మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టరేట్ ప్రారంభోత్స‌వంలో కేసీఆర్


గత కొన్నాళ్లుగా దేశంలో కులం, మతం పేరుతో అశాంతిని రేకెత్తించి.. ప్రజల మధ్య స్నేహాన్ని విచ్ఛిన్నం చేయడానికి కొంత మంది ప్రయత్నిస్తున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడుకోవల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన స్పష్టం చేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కొత్త కలెక్టరేట్ భవన సముదాయాన్ని కేసీఆర్ బుధవారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఒక బంగ్లా కట్టాలన్నా, ఒక భవనాన్ని నిర్మించాలన్నా చాలా కష్టం. కానీ దాన్ని కూల్చడం చాలా సులభం. అలాగే ఎంతో మంది త్యాగాల ద్వారా దేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నాం. 75 ఏళ్లుగా దేశాన్ని నిర్మించుకుంటూ వస్తున్నాము. కానీ, ఒక పార్టీ మాత్రం నీచమైన రాజకీయాలతో దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకొని పోతుందని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని తాను ఉద్యమ సమయంలోనే చెప్పిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణకు ఇన్ని డబ్బులు ఎక్కడివి? భారీ అప్పులు చేస్తున్నట్లు కొంతమంది ప్రచారం చేస్తున్నారు. కానీ, మన నిధులు, వనరులు మనవే అయినప్పుడు డబ్బులేకుండా ఎలా పోతుందని ఆయన ప్రశ్నించారు.

అదిలాబాద్‌లోని గోండు గూడెంలు, వరంగల్‌లోని లంబాడి తండాలు.. హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్ వరకు నిరంతరంగా, నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని కేసీఆర్ చెప్పారు. హైదరాబాద్‌లో నిరంతరాయంగా కరెంట్ ఉంటుంది. 24 గంటలు విద్యుత్ అందిస్తున్నాము. కానీ దేశ రాజధానిలో మాత్రం కరెంట్ ఎప్పుడుంటదో.. ఎప్పుడు పోతదో తెలియని పరిస్థితి అని కేసీఆర్ చెప్పారు. కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత కరెంటును సాధించుకోవడమే కాకుండా.. ఎన్నో ప్రాజెక్టులు కట్టుకున్నాం, పథకాలు అమలు చేసుకున్నామని చెప్పారు. ఒంటరి మహిళలకు పింఛ‌న్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని చెప్పారు. ఇవ్వాళ గ్రామాల్లోని వృద్ధులు తన పెద్ద కొడుకు కేసీఆర్ నెల నెలా డబ్బులు పంపిస్తున్నాడని అంటున్నారు. ఇంటిలోని అందరికీ తలా 6 కేజీల బియ్యం కూడా ఇస్తున్నామని.. ఇలా రాష్ట్రంలోని అందరూ సంతోషంగా ఉన్నారని కేసీఆర్ చెప్పారు.

మేడ్చల్-రంగారెడ్డి జిల్లా ఎంతో చైతన్యం ఉన్న జిల్లా. హైదరాబాద్‌ను ఆనుకొని ఉండటంతో ఫ్యాక్టరీలు, ఐటీ కంపెనీలతో పాటు వ్యవసాయం కూడా ఉందని అన్నారు. ఎంతో మంది ఈ జిల్లాకు ఇతర రాష్ట్రాల నుంచి వలస వస్తున్నారని కేసీఆర్ చెప్పారు. దాదాపు 12 రాష్ట్రాల నుంచి కూలీలు ఇక్కడికి వస్తుండటంతో ఎన్నో కొత్త బస్తీలు కూడా శివారులో ఏర్పడ్డాయని అన్నారు. అందుకే కొత్త కాలనీలు, బస్తీల్లో మౌలిక సదుపాయాలు మెరుగు పరచడానికి ఎమ్మెల్యేలకు ఇప్పటికే ఇచ్చిన రూ. 5 కోట్లకు అదనంగా మరో రూ. 10 కోట్లు మంజూరు చేస్తున్నానని చెప్పారు. ప్రతీ ఎమ్మెల్యే రూ. 10 కోట్లను ఉపయోగించి సదుపాయాలు మెరుగు పరచాలని కోరారు. ఈ 70 కోట్ల రూపాయ‌ల‌ నిధుల విడుదలకు జీవో రేపే విడుదల చేయిస్తామని అన్నారు.

రూ. 56 కోట్లతో కలెక్టరేట్..

ఉమ్మడి రంగారెడ్డి జల్లా నుంచి కొత్తగా వికారాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలు 2017 అక్టోబర్ 11న ఏర్పాటు అయ్యాయి. ఈ రెండు జిల్లాల కొత్త కలెక్టరేట్ భవన సముదాయం రెండు రోజుల వ్యవధిలో ప్రారంభించారు. ఇప్పటి వరకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం కీసర సమీపంలోని ఓ అద్దె భవనంలో కొనసాగుతోంది. ఇక మిగిలిన శాఖల అధికారుల కార్యాలయాలు ఒక్కో చోట ఉన్నాయి. దీంతో తీవ్రమైన ఇబ్బంది కలుగుతోంది. ఈ క్రమంలోనే కొన్నేళ్ల క్రితం తూముకుంట సమీపంలోని అంతాయిపల్లిలో కొత్త కలెక్టరేట్ సముదాయానికి శంకుస్థాపన చేశారు.

రూ. 56.20 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ భారీ భవనంలో 55 గదులు ఉన్నాయి. కలెక్టర్, ఇద్దరు జేసీలు, డీఆర్వో, ఏవో, పలు శాఖల‌ అధికారుల కోసం ప్రత్యేక గదులు ఉన్నాయి. జిల్లా మంత్రికి కూడా ఒక ప్రత్యేక ఛాంబర్ ఉంది. 250 మంది కూర్చొనే వీలుగా మీటింగ్ హాల్ ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ పక్కనే హెలీ ప్యాడ్ కూడా నిర్మించారు.

First Published:  17 Aug 2022 12:31 PM GMT
Next Story